Bhudan Pochampally Village Is Internationally Recognized :
తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా భూదాన్ పోచంపల్లి ఖ్యాతి గడించింది.
ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉన్న ప్రపంచ పర్యాటక సంస్థ.. భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది. భారతదేశం నుంచి 3 గ్రామాలు పోటీ పడగా భూదాన్ పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి అవార్డును ప్రదానం చేయనున్నారు. భూదానోద్యమంతో పోచంపల్లికి భూదాన్ పోచంపల్లిగా మారింది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా కూడా పోచంపల్లి పేరు సంపాదించింది. పోచంపల్లిలో నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది.
ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసిన నేపథ్యంలో భూదాన్ పోచంపల్లి ప్రజలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, నేతన్నలను ప్రోత్సహించే పలు కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందన్నారు. చేనేతకు పేరొందిన పోచంపల్లి గ్రామానికి దక్కిన ఈ అవార్డు వల్ల అక్కడ నేసే ఇక్కత్ చీరలకు అంతర్జాతీయంగా మరింత గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ లోని రామప్ప ఇటీవల ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందడం, ఇప్పుడు పోచంపల్లి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక కావడం తెలంగాణ పర్యాటక రంగానికి ఎంతగానో దోహదం చేస్తాయని కేటీఆర్ అభిలషించారు.
Also Read : అధైర్య పడొద్దు..అండగా ఉంటాం- మంత్రి కేటీఆర్