ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి అధ్యక్షుడిగా రెండో సారి ఎన్నిక కావడం సంతోషంగా ఉందని టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. శ్రీవారి ఆలయంలోని గరుడ ఆల్వార్ సన్నిధిలో టిటిడి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత అన్నమయ్య భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కండలు కరిగించుకొని, నెత్తురును స్వేదంగా చిందించి కష్టపడి సంపాదించిన సొమ్ములో కొంతభాగం తిరుమల శ్రీవారికి కానుకలు సమర్పించి త్రుటి కాలపు దర్శనం కోసం తాపత్రయ పడే సామాన్య భక్తులే తన తాత్వికత అని వెల్లడించాడు. ధనవంతులకు ఊడిగం చేయడానికో, వారికి ప్రథమ తాంబూలం ఇవ్వడానికో తానూ ఈ పదవి చేపట్టలేదని శపథం చేశారు. గతంలో పాలక మండలి అధ్యక్షుడిగా కూడా సామాన్యులకే పెద్ద పీట వేశానని గుర్తు చేశారు.

