Saturday, November 23, 2024
HomeTrending Newsసుప్రీంకు చేరిన బిల్కిస్ నిందితుల విడుదల వ్యవహారం

సుప్రీంకు చేరిన బిల్కిస్ నిందితుల విడుదల వ్యవహారం

గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాది అపర్ణ భట్  దాఖలు చేసిన పిటిషన్ ను ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ విచారణకు స్వీకరించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, మరో పిటిషనర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించనుంది. క్షమాభిక్షకు అనుమతించిన విధానాలు, నిబంధనల్ని న్యాయస్థానానికి వివరించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుభాషిణి అలీ తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, మహువా మోయిత్రా తరపున అభిషేక్ సింఘ్వీ, న్యాయవాది అపర్ణా భట్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. క్షమాభిక్ష మంజూరు చేసిన విధానాలు సరిగా లేవని పిటిషనర్లు పేర్కొన్నారు. దోషుల విడుదలను సవాల్ చేస్తు దాఖలైన పిటిషన్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదిస్తూ గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

2002లో గుజరాత్‌లో గోద్రా అల్లర్ల సమయంలో 5 నెలల గర్భవతి అయిన బిల్కిస్ బానో సహా ఏడుగురిపై ఈ నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిల్కిస్ బానో మూడేళ్ల కుమార్తె సలేహా సహా 14 మంది కుటుంబ సభ్యులను అత్యంత క్రూరంగా కాల్చి చంపేశారు. ఈ కేసును విచారించిన ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు 2008, జనవరి 21న 11 మంది నిందితులకు జీవత ఖైదు విధించింది. ఆ తరువాత వారు బాంబై హైకోర్టును ఆశ్రయించగా.. బాంబే హైకోర్టు కూడా ఈ తీర్పును సమర్థించింది. అప్పటి నుంచి వీరు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. యావజ్జీవ కారాగార శిక్ష పడిన 11 మంది దోషులందరినీ విడుదల చేసేందుకు గుజరాత్ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం నిందితులంతా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే, జైలు నుంచి విడుదలైన సందర్భంగా వీరందరికీ పూలమాలలు వేసి, స్వీట్లు తినిపించి సత్కరించారు కొందరు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెను దుమారం రేపగా… తాజాగా ఈ కేసు సుప్రీం కోర్టు దగ్గరకు చేరింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్