Friday, November 22, 2024
Homeతెలంగాణతెలంగాణలో తొమ్మిది మంది బిజెపి అభ్యర్థులు ఖరారు

తెలంగాణలో తొమ్మిది మంది బిజెపి అభ్యర్థులు ఖరారు

బీజేపీ తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపి స్థానాలు కాగా  తొమ్మిది మందిని ఖరారు చేశారు. మరో ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. తొలి జాబితాలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తొమ్మిది మందిలో మున్నూరు కాపు-2, రెడ్డి-2, బ్రాహ్మణ-1, గౌడ్-1, వీరశైవ లింగాయత్-1,SC(మాదిగ)-1, ముదిరాజ్-1 కేటాయించారు.

మల్కాజ్ గిరి నుంచి అనేక మంది నేతలు పోటీ పడినా వారికి నిరాశే ఎదురైంది. రెండు మూడు రోజులుగా హైదరాబాద్ సర్కిల్స్ లో పుకార్లు షికార్లు చేసినట్టుగానే…  చివరకు ఈటల రాజేందర్ కు టికెట్ దక్కింది. రకరకాల ఊహాగానాల మధ్య మల్కాజ్‌గిరి సీటును దక్కించుకున్నారు ఈటల రాజేందర్. మల్కాజ్‌గిరి టికెట్ ఆశించి సీనియర్ నేత మురళీధరరావు, మల్క కొమరయ్య, పన్నాల హరీశ్ రెడ్డిలకు భంగపాటు తప్పలేదు.

జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్‌కు బీజేపీలో చేరిన తదుపరి రోజే టికెట్ దక్కటం గమనార్హం. మహారాష్ట్ర బిజెపి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నఎంపి బిబి పాటిల్ పార్టీ మారుతారని శాసనసభ ఎన్నికల ఫలితాల నాటి నుంచే చర్చ జరుగుతోంది.

  • గంగాపురం కిషన్ రెడ్డి (సికింద్రాబాద్)
  • బండి సంజయ్ కుమార్ (కరీంనగర్)
  • ధర్మపురి అరవింద్ (నిజామాబాద్)
  • బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి)
  • డాక్టర్ మాధవి లత (హైదరాబాద్)
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల)
  • పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్)
  • బీబీ పాటిల్ (జహీరాబాద్)
  • ఈటల రాజేందర్ (మల్కాజిగిరి)

తొలి జాబితాలో ఆదిలాబాద్ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావుకు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎల్లుండి ఆదిలాబాద్ కు నరేంద్ర మోదీ వస్తున్నారు. అయినప్పటికీ ఆ ఎంపీ సీటుపై అధిష్ఠానం ఎటూ తేల్చలేదు. ఈ సీటు కోసం రాథోడ్ రమేష్, మాజీ ఎంపి గోడం నగేష్  పోటీ పడుతున్నారు. వివిధ సమీకరణాల నేపథ్యంలో ఆదిలాబాద్ స్థానం ఆదివాసిలకు కేటాయించేందుకు చర్చోప చర్చలు జరుగుతున్నాయి.

నాగర్‌కర్నూల్ సీటును తన కుమారుడు భరత్ కు ఇప్పించుకున్నారు సిట్టింగ్ ఎంపీ రాములు. దీనిపై ఆశ పెట్టుకున్న బంగారు శ్రుతికి నిరాశే ఎదురైంది. కొన్నేళ్లుగా బంగారు శృతి నియోజకవర్గంలో విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కల్వకుర్తిలోనే మకాం వేసి పార్టీ అభ్యర్థి గెలుపునకు చెమటోడ్చారు .

హైదరాబాద్ ఎంపి స్థానం కోసం పాతబస్తీ బిజెపి నేత యమునా పాథక్ పేరు వినిపించినా అధిష్టానం డాక్టర్ మాధవి లతకు అవకాశం కల్పించింది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే మాధవి లత పేరు హైదరాబాద్ స్థానం కోసం ప్రముఖంగా వినిపిస్తోంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో ముందుండే మాధవి లత విరించి ఆస్పత్రి చైర్ పర్సన్ గా ఉన్నారు.

తొలి నుంచి అనుకున్నట్టుగానే సికింద్రాబాద్- కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ – ధర్మపురి అరవింద్, చేవెళ్ళ – కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి – డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ లకు బిజెపి టికెట్ లభించింది.

బిజెపి అధిష్టానం మహబూబ్‌నగర్ స్థానాన్ని పెండింగ్ లో పెట్టింది. మహబూబ్‌నగర్ సీటు కోసం డీకే.అరుణ, జితేందర్ రెడ్డి, శాంతికుమార్ మధ్య తీవ్ర పోటీ ఉంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్