Monday, November 25, 2024
HomeTrending Newsఉత్తరాదిలో కమల వికాసంపై అనుమానాలు?

ఉత్తరాదిలో కమల వికాసంపై అనుమానాలు?

ఆరో విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ, ఇప్పటివరకు వోటింగ్ జరిగిన దశలను విశ్లేషిస్తే బిజెపికి కొంత నిరాశాజనకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదేళ్ళ బిజెపి పాలనపై ఉత్తర భారతీయులు అసంతృప్తితో ఉన్నట్టుగా అవగతం అవుతోంది. ‘అబ్ కి బార్ చార్ సౌ పార్’ నినాదం బిజెపికి గుది బండగా మారనుందని విశ్లేషణ జరుగుతోంది. అచ్చే దిన్ ఆయేగా నినాదం ఆకట్టుకోవటం లేదని వార్తలు వస్తున్నాయి. సబ్ కా వికాస్.. నినాదానికే పరిమితం అయిందని.. దేశంలో బడా పారిశ్రామిక వేత్తలకు కొందరికే మేలు జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

ముఖ్యంగా ఉత్తరప్రదేశ్(80), బీహార్(40), హర్యానా(10), రాజస్థాన్(25), ఢిల్లీ(7) రాష్ట్రాల్లో బిజెపికి ప్రతికూల పరిస్థితులు బలపడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.  బీహార్ లో నితీష్ కుమార్ తో పొత్తు బిజెపిని నష్ట పరిచే విధంగా మారుతోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. నిరుద్యోగంపై ప్రకటనలే కానీ బిజెపి ఆచరణలో విఫలమైందని, జమ్మూ కాశ్మీర్ లో సైనిక కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడిలో మరణించిన సైనికుల అంశం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.

హర్యానాలో జాట్ వర్గం బిజెపి పట్ల అసంతృప్తితో ఉంది. రాష్ట్రంలోని పది సీట్లు రెండు దఫాలు గెలిచిన బిజెపి ఈ దఫా నిలబెట్టుకోవటం కష్టతరమని తెలుస్తోంది. మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతుల ఆందోళన పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. హర్యానా నుంచి జాట్ వర్గం నుంచి సైన్యంలో అధికంగా ఉన్నారు. వీరంతా అగ్నివీర్ పథకాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. లైంగిక వేధింపులపై రెజ్లర్ల ఆందోళన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడుతున్నారు. రాష్ట్ర సిఎంగా మనోహర్ ఖట్టర్  ను తొలగించి బిసి నేత నాయబ్ సైనీని సిఎం చేసినా ప్రజలను సంతృప్తి పరచలేదు.

ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లోక్ సభ స్థానంలో కేంద్రమంత్రి అజయ్ మిశ్ర తేనికి టికెట్ ఇవ్వటంపై రాష్ట్రంలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. రైతుల మీదకు వాహనం ఎక్కించిన తేనికి మళ్ళీ టికెట్ ఇవ్వటం వివాదాస్పదం అవుతోంది. యుపిఏ హయంలో సిలిండర్ ధర 400 రూపాయలు పెరిగితే అప్పటి పిఎం మన్మోహన్ సింగ్ కు గాజులు పంపిన స్మృతి ఇరానీ…  ఇప్పుడు వెయ్యి రూపాయలకు చేరినా ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రివాల్ అరెస్టు మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేజ్రివాల్ అరెస్టుపై ఢిల్లీ వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో కేజ్రివాల్ తీసుకొచ్చిన మద్యం విధానానికి సామాన్య పౌరులు బలవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ – ఆప్ జత కట్టడంతో రెండు పార్టీలకు మేలు జరుగుతుందని సమాచారం.

200 యూనిట్ల కరెంటు ఫ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రజలను ఆకట్టుకుంటోంది. ఢిల్లీలోని ఏడు స్థానాలు గెలుచుకున్న బిజెపి ఈ దఫా వాటిని తిరిగి దక్కించుకోవటం కొంత కష్టతరంగా ఉందని తెలుస్తోంది.

బీహార్ లో సిఎం నితీష్ కుమార్ తో బిజెపి జత కట్టడం ప్రతికూలంగా మారుతున్నట్టుగా ఉంది. బీహార్ లో ఉద్యోగాల భర్తీ సక్రమంగా జరగటం లేదని.. లీకులు జరగటం.. వాయిదా పడటం దేనికి సంకేతం అంటున్నారు. మన్ కి బాత్ పేరుతో ప్రధాని మోడీ తన మనసులో మాట చెప్పటం తప్పితే ప్రజల అంతరంగం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని బీహారీలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నిరుద్యోగం, నిర్యావసరాల ధరలు పెరుగుతుంటే గ్యారంటీల పేరుతో దేశ ప్రజలను మోసం చేస్తున్నారని అంటున్నారు.

కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగామేడీ

రాజస్థాన్ లో రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీకి చెందిన జాట్ నేత హనుమాన్ బేనివాల్ బిజెపిని వీడి కాంగ్రెస్ కూటమిలో చేరటం కమల దళానికి మైనస్ అంటున్నారు.  కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోగామేడీ హత్యతో రాజ్ పుత్ వర్గం బిజెపి పట్ల నారాజ్ గా ఉంది. రాష్ట్రంలో గెలుపు ఓటములను నిర్ణయించే రాజ్ పుత్ లు సీట్ల కేటాయింపులో బిజెపి అంతగా పట్టించుకోలేదనే ఆరోపణలు చేస్తున్నారు.

రాజ్ పుత్ రాజులు తమ సంస్థానాలను కాపాడుకునేందుకు రాజ్ పుత్ అమ్మాయిలను మొఘల్ రాజులకు ఇచ్చి వివాహం చేశారని కేంద్ర మంత్రి పురుషోత్తం రుపాలా వ్యాఖ్యానించటం తీవ్ర దుమారం రేపింది. పురుషోత్తం రూపాల వ్యాఖ్యల ప్రభావం గుజరాత్ లో కూడా ఉండనుంది.

తాత్కాల్, ప్రేమియం తాత్కాల్ పేరుతో రైల్వేలను బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శలు వస్తున్నాయి. రైళ్ళ సమయ పాలన పాటించక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దేశానికి చౌకిదార్ గా పనిచేస్తానని చెప్పిన మోడీ హయంలోనే నీరవ్ మోడీ, విజయ్ మాల్య తదితరులు దేశం నుంచి తప్పించుకు పోయారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి రెండు దశలు పూర్తి అయిన నాటి నుంచి ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ.. ముస్లిం వర్గాలను తెరమీదకు తీసుకొస్తున్నారని విమర్శలున్నాయి.

అయితే రాజస్థాన్, ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడి చరిష్మా తగ్గలేదనే వాదనలు బలంగా ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో ప్రధాని మోడితో పోలిస్తే సిఎం యోగి పరిపాలనకే రాష్త్రప్రజలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. యుపిలో కొన్ని సీట్లు తగ్గినా కమల వికాసానికి డోకా లేదనే వాదన ఉంది. బీహార్, హర్యానాలో జరిగే నష్టం ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో భర్తీ అవుతుందని కమల దళం విశ్వాసంగా ఉంది.

మరోవైపు జాతీయ అంశాలు పరిగణనలోకి తీసుకునే ఓటర్లు ఇండియా కూటమికి ఓటు వేయాలని ఉన్నా అందులో పరిణతి కలిగిన నేతలు లేరని పెదవి విరుస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కాశ్మీర్ లో ౩70 ఆర్టికల్ పునరుద్దరిస్తామని రాహుల్ గాంధి పలు సందర్భాల్లో చెప్పటం వివాదాస్పదం అవుతోంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్