యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు – రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బీజేపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈడీ అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని, ముఖ్య నాయకులను ఈడీ కేసులతో భయపెట్టి వారిని బీజేపీ లోకి చేర్చుకోవాలని చూస్తోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ రాహుల్ పాదయాత్రతో మార్పు వస్తుందనే.. గతంలో మూసేసిన హెరాల్డ్ కేసును మళ్లీ తెరిచారన్నారు. హెరాల్డ్ కేసులో ఎలాంటి తప్పిదాలు జరగలేదని గతంలోనే కేసును మూసేశారని, రాహుల్ పాదయాత్రను అడ్డుకునేందుకే కేసును మళ్లీ తెరిచారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి విమర్శలు ఆయన మాటల్లోనే

ఈడీ అధికారులను ఉసిగొలిపి రాహుల్ గాంధీని విచారణకు పిలిచారు. సోనియాగాంధీ అనారోగ్యంతో ఉన్నా.. ఆమెను విచారణకు పిలిచి వేధింపులకు పాల్పడ్డారు. అయినా భారత్ జోడో యాత్ర ఆగకపోవడంతో రాష్ట్రాల నేతలకు నోటీసులు ఇస్తున్నారు. కర్ణాటకలో యాత్రను అడ్డుకునేందుకు శివకుమార్ కు ఈడీ విచారణకు పిలిచింది. ఏయే రాష్ట్రాల్లో పాదయాత్ర ఉందో.. అక్కడి నేతలకు ఈడీ నోటీసులిస్తోంది. ఈడీ అంటే బీజేపీ తన ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుంది. గీతారెడ్డి, షబ్బీర్ అలీ,సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ లాంటి క్రియాశీల నాయకులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కోటి రూపాయల చందా ఇచ్చినందుకు అయిదుగురు నేతలకు నోటీసులిచ్చారు. వారిని భయపెట్టి పాదయాత్రలో పాల్గొనకుండా చేయాలని చూస్తున్నారు. బీజేపీకి చందాలు ఇచ్చిన ఏ ఒక్కరికైనా నోటీసులిచ్చారా? ఆరేడేళ్లలో బీజేపీకి 4841 కోట్ల రూపాయలు చందాలు వచ్చాయి. అధికారంలో ఉన్నారనే వారికి చందాలు ఇచ్చిన వారికి నోటీసులు ఇవ్వలేదు.

కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందన్న బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? కేసీఆర్ అవినీతిపై వివరాలతో సహా నేను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కూలీ పేరుతో కోట్ల రూపాయలు టీఆరెస్ వసూలు చేసిందని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పిర్యాదు చేశాను. స్పష్టమైన నివేదిక ఇస్తే రాష్ట్రంలో టీఆరెస్ పార్టీనే ఉండదు. తొడుక్కోవడానికి అంగీలు లేని కార్యకర్తలున్న టీఆరెస్ కు 8వందల కోట్లకు పైగా ఆస్తులు ఎలా వచ్చాయి. ఢీల్లీలో అత్యంత విలువైన ప్రాంతంలో టీఆరెస్ పార్టీ ఆఫీసుకు స్థలం కేటాయించారు. కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ముందస్తు ఒప్పందంలో భాగమే కేసీఆర్ కు ఢీల్లీలో స్థలం ఇచ్చారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా.. టీఆరెస్ నేతలకు ఒక్క నోటీసు ఇవ్వడం లేదు. ఈడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఫిరాయింపుల కమిటీలో కీలక నేత కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు వస్తాయని ముందే చెప్పడం వెనక మతలబు ఏమిటీ?

కాంగ్రెస్ లో చేరాలనుకున్న వారిని భయపెట్టి బీజేపీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసుల వెనక కుట్రను ప్రజలు గమనించాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై ఈడీ ఎందుకు విచారణ జరపడం లేదు? ఈడీ, ఇన్ కం టాక్స్, సీబీఐ లు మా మనోధైర్యం దెబ్బతీయలేవు. తెలంగాణలో కాంగ్రెస్ మనుగడలో ఉంటే కష్టమనే బీజేపీ ఇలా వ్యవహరిస్తోంది. ఒక పార్టీ ఎదగాలంటే.. ఇంతలా దిగజారాలా? గతంలో జరిగిన నాలుగు ఉప ఎన్నికల్లో టీఆరెస్, బీజేపీ గెలిచినా పైసా మార్పు రాలేదు.

మునుగోడు ప్రజలారా మీ ఆడబిడ్డకు ఒక ఛాన్స్ ఇవ్వండి. తెలంగాణలో గుణాత్మక మార్పు తీసుకొస్తాం. 11 రాష్టాల్లో ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. హెరాల్డ్ కేసు ఒక రాజకీయ ప్రేరేపితమైన కేసు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ చేసినా.. వారందరినీ సమానంగానే గౌరవిస్తాం. అనుకోని కారక్రమాలు ఉండటం వల్లే శశిథరూర్ ను కలవలేకపోయా. యూపీఏను చీల్చడానికే కేసీఆర్ డ్రామాలు. జాతీయ స్థాయిలో జగన్, అసదుద్దీన్ ను ఎందుకు కలుపుకోవడంలేదు? కేసీఆర్ ప్రతీ చర్య.. బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడానికే. కేసీఆర్ మోదీని ఓడించాలనుకుంటే… బీజేపీ భాగస్వామ్య పక్షాలను బయటకు తీసుకురావాలి. కేసీఆర్ చర్యలన్నీ మోదీ సూచనలతో జరుగుతున్నవే. అందుకే ఆయనపై మోదీ ప్రభుత్వం ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలేదు. ఈఎస్ఐ కుంభకోణం పై ఇప్పటి వరకు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. కాంగ్రెస్ ను బలహీన పరచేందుకే కేసీఆర్, మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Also Read: టీఆరెస్,బీజేపీ ఓటమి చారిత్రక అవసరం రేవంత్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *