Saturday, January 18, 2025
HomeTrending Newsభారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి

భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి

బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో బోరిస్‌ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్‌- బ్రిటన్‌ మధ్య వాణిజ్య, ప్రజా సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు.

అనంతరం బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, సైనిక, వాణిజ్య సంబంధాల గురించి ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌పై కూడా వీరు చర్చించే అవకాశం ఉంది. కాగా బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందినవారే కావడంతో ఆయన నేరుగా అహ్మద్‌బాద్‌ వచ్చారు. గతంలో కరోనా కారణంగా బోరిస్‌ జాన్సన్‌ రెండుసార్లు భారత పర్యటన రద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర వేడుకలకు భారత్‌ ఆహ్వానించగా.. యూకేలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో మరోసారి ఆయన టూర్ రద్దయ్యింది.

రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో బోర్రిస్ జాన్సన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు అంశం రెండు దేశాల ప్రధానుల సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Also Read : లండన్ ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్