జీవో నంబర్ వన్ లో అసలు ఏమి ఉందో తెలుసుకోవాలని… రోడ్ షోలు, ర్యాలీలపై  నిషేధం విధిస్తున్నట్లు ఎక్కడా లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ స్పష్టం చేశారు. రోడ్లపై బహిరంగసభలు వద్దని మాత్రమే ఉందని, కానీ ఎవరైనా అక్కడ పెట్టుకోవాలని భావిస్తే ముందుగా అనుమతి తీసుకోవాలని  వివరించారు.  ప్రజలకు రక్షణ కల్పించడం, వారికి అసౌకర్యం కలగకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు.  కందుకూరు, గుంటూరు ఘటనల తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ బాబు ఇంట్లో కూర్చోవాల్సి ఉందని అన్నారు. పైగా ఈ రెండు సంఘటనల వెనుకా వైసీపీ ఉందని  బాబు అనుమానం వ్యక్తం చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు.

వైఎస్, జగన్ లు పాదయాత్రలు చేసినప్పుడు తాము ముందు జాగ్రత్తగా ఇలాంటి సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకున్నామని, జగన్ యాత్ర సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం భారీగా భద్రత కల్పించలేదని…. కానీ తాము ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన ఏర్పాట్లు చేసుకున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే తాము యాత్ర చేశామని, అన్ని అనుమతులు ముందుగా తీసుకున్నామని, బహిరంగ సభలు వద్దంటే పెట్టలేదని వివరించారు.

ఈ జీవోపై విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, అన్ని పార్టీలకూ ఇది వర్తిస్తుందని చెప్పారు.  దీనిపై బాబుకు వంత పాడుతున్న మీడియా కూడా జీవోను చదువుకుని రాయాలని బొత్స హితవు పలికారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రోడ్లపై సభలకు కూడా అనుమతి ఇస్తామని జీవోలో పేర్కొన్నామని బొత్స అనారు. బాబు కుప్పం పర్యటనలో కూడా రోడ్డుపై ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. చంద్రబాబు వ్యక్తం చేయలేని అభిప్రాయాలు సెలబ్రిటీ పార్టీ నేత చెబుతుంటారని ఎద్దేవా చేశారు.  తన పరిపాలనా కాలంలో ఏ హామీనీ బాబు అమలు చేయలేకపోయారని, ఆయన పాలన అంతా మోసం, దగా మాత్రమేనని విమర్శించారు.

బిఆర్ఎస్-వైసీపీల మధ్య లోపాయికారీ సంబంధం ఉందంటూ వస్తున్నా వార్తలను బొత్స కొట్టిపారేశారు. ఆ పార్టీతో తమకేం సంబంధం ఉంటుందని…. ఇవి పసలేని ఆరోపణలని, ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉన్నాయని, బొత్స విమర్శించారు. బిఆర్ఎస్ ను ఓ రాజకీయ పార్టీగానే చూస్తామని, ఎన్నో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయని, వారికి ఈ రాష్ట్రంలో ఎలాంటి స్థానం ఉండబోదని అభిప్రాయపడ్డారు.

Also Read : బిసిలను ముంచిందే మీరు: బాబుపై బొత్స

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *