వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక నాయకుడు బొత్స సత్యనారాయణ విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం ఇక లాంఛనమే కానుంది. ఈ ఎన్నికల్లో కూటమి తరఫున పోటీ పెట్టకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయించారు.
నిన్న విశాఖకు సంబంధించిన కూటమి ముఖ్య నేతలు ఎన్నికల్లో పోటీ చేయాలని తమ అభ్యర్ధిగా బైరా దిలీప్ చక్రవర్తి పేరు ఖరారు చేసి తుది ఆమోదం కోసం చంద్రబాబుకు పంపారు. అయితే తగినంత సంఖ్యా బలం లేకపోవడం, ఇప్పటికే వైఎస్సార్సీపీ తమ ఓటర్లను క్యాంపులకు తరంలించడంతో పోటీ చేయకపోవడమే ఉత్తమమని బాబు నిర్ణయించారు. అసలు మొదటినుంచీ ఈ పోటీకి చంద్రబాబు విముఖంగానే ఉన్నారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన దృష్ట్యా స్థానిక సంస్థల కు చెందిన ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు అధికారపార్టీ వైపు మొగ్గు చూపుతారని టిడిపి, జనసేన నేతలు భావించారు. అయితే వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా బొత్స అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు. వెంటనే రంగంలోకి దిగిన బొత్స వరుస సమావేశాలు నిర్వహించి…తమ పార్టీ ప్రతినిధులను సమన్వయం చేసుకోవడంలో కృతకృత్యులయ్యారు. ఇప్పటికే కొంతమంది పార్టీ వీడగా మిగిలిన వారిలో ఎవరూ పార్టీ మారకుండా జాగ్రత్తపడ్డారు. దీనితో పోటీ చేసినా ఓటమి తప్పదని భావించి బాబు పునరాలోచన చేశారు.
అయితే స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఆయన ఉపసంహరించుకుంటే బొత్స ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నేడు నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కాగా రేపు స్క్రూటినీ జరగనునుంది. నామినేషన్ల ఉపసంహరణకు 16 చివరిరోజు.
వంశీ కృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానానికి పదవీ కాలం 2027 డిసెంబర్ 1 వరకూ ఉంది.