తెలుగుతెరపై ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులకు నవ్వులు పంచిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ‘పంచంతంత్రం’ సినిమా కోసం కథకుడిగా కొత్త అవతారం ఎత్తారు. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకాల పై అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోటు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మానందం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన వేదవ్యాస్ పాత్రలో కనిపించబోతున్నారు. కథకుడు రెడీ అంటూ మైక్ ముందు మాట్లాడుతున్న బ్రహ్మానందం లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. నవ్వించడమే కాదు అవసరమైతే సెంటిమెంట్‌ను పండిస్తూ ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించగలరు. తన నటనతో మనసుల్ని కదిలించగలరని చాటి చెప్పేలా బ్రహ్మానందం పాత్ర ఉంటుంది.
నిర్మాతల్లో ఒక్కరైన అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ “రెండేళ్ల విరామం తర్వాత బ్రహ్మానందం నటిస్తున్న చిత్రమిది. గతంలో కొన్ని సన్నివేశాలను ఆయనపై తెరకెక్కించాం. ఇటీవల ప్రారంభమైన షెడ్యూల్‌లో బ్యాలెన్స్ సన్నివేశాలను పూర్తి చేశాం. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం. నవంబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. కామెడీ క్యారెక్టర్‌కు భిన్నంగా సరికొత్త పాత్రలో బ్రహ్మానందం కనిపించబోతున్నారు. డ్రామా, సెంటిమెంట్ అంశాలతో హృదయాల్ని హత్తుకునేలా ఉంటుంది. వేదవ్యాస్‌గా ఆయన పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది” అని తెలిపారు.
దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ ‘పంచతంత్రం’ కథ, పాత్రలను వివరించే కథకుడిగా బ్రహ్మానందం కనిపిస్తారు. నటుడిగా ఆయన్ని కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది” అన్నారు.