Saturday, July 27, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్ పునః ప్రారంభం

ఐపీఎల్ పునః ప్రారంభం

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ నేటి నుంచి పునఃప్రారంభం కానుంది. 2021 ఏప్రిల్ 9న చెన్నైలోని చిదంబరం స్టేడియం లో మొదలైన ఐపీఎల్ 14వ ఎడిషన్  ఏప్రిల్ నెలలో సవ్యంగానే జరిగింది. కానీ మే 1వ తేదీ నుంచి ఐపీఎల్ లో పాల్గొంటున్న  కొన్ని జట్లలోని సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. మరో రెండ్రోజుల్లోనే కోల్ కతా తో పాటు పలు ఫ్రాంచైజీల ఆటగాళ్ళు కూడా కోవిడ్ వైరస్ కు గురయ్యారు. ఈ కారణంగానే మే 3న జరగాల్సిన కోల్ కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్ కూడా రద్దయింది. దీనితో బిసిసిఐ మే 4న అత్యవసరంగా సమావేశమై సిరీస్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సీజన్ ను కొనసాగించాలా లేదా పూర్తిగా రద్దు చెయాలా అనే అంశంపై పలుమార్లు సమాలోచనలు జరిపిన బిసిసిఐ ఫ్రాంచైజీల ఒత్తిడితో దుబాయ్, ఒమన్ లో కొనసాగించాలని నిర్ణయించింది.

ఐపీఎల్ లో పాల్గొంటున్న వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్ళ అందుబాటు, ఆయా దేశాలు అప్పటికే ఫిక్స్ చేసుకున్న ద్వైపాక్షిక సిరీస్ లు, టి-20 వరల్డ్ కప్… ఇలా పలు అంశాలను గమనంలోకి తీసుకొని సెప్టెంబర్ 19 నుంచి కొనసాగించాలని తీర్మానించింది. ఐసిసి టి-20 వరల్డ్ కప్ కు కూడా ఇండియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది, ఈ దశలో ఆ టోర్నీని కూడా దుబాయ్, ఒమన్ లోనే నిర్వహించాలని బిసిసిఐ నిర్ణయించి ఆ మేరకు అన్ని దేశాల క్రికెట్ బోర్డులకు వర్తమానం పంపింది.

నేడు జరిగేఐపీఎల్ పునఃప్రారంభ మొదటి మ్యాచ్ లో ధోనీ సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ తో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సిరీస్ వాయిదా పడే సమయానికి ఢిల్లీ క్యాపిటల్స్ 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ (10); రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (10); ముంబై ఇండియన్స్ (8) పాయింట్లతో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్