Wednesday, June 26, 2024
HomeTrending NewsBRS Manifesto: అధికారమే పరమావధి...కెసిఆర్ ఎన్నికల వరాలు

BRS Manifesto: అధికారమే పరమావధి…కెసిఆర్ ఎన్నికల వరాలు

2023 అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్ మేనిఫెస్టోను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ఈ రోజు(ఆదివారం) విడుదల చేశారు. ఇందులో కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. సంపద సృష్టి కన్నా.. సంపద పంపిణీ కేంద్రంగానే కెసిఆర్ మేనిఫెస్టో ఉంది. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు కెసిఆర్ పదునైన కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ పథకాలు మేడి పండు చందంగా ఉన్నాయనేందుకు కొన్ని విశ్లేషణలు ఉన్నాయి.

తెల్లరేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రకటించారు. వరి సన్న రకానికి చీడపీడలు ఎక్కువ…దానికి పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో దొడ్డు బియ్యం తినేందుకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. ఇక సన్న బియ్యం పంపిణీ చెప్పుకునేందుకు గొప్పగా ఉన్నా…రాబోయే రోజుల్లో షుగర్ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.

ఆరోగ్యశ్రీ పరిమితి పెంచారు. కెసిఅర్ అరోగ్య రక్ష – ఇప్పుడున్న 10 లక్షల ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి 15 లక్షలకు పెంపు, జర్నలిస్టులకు వర్తింప చేస్తామన్నారు. అటు సన్న బియ్యం తినిపించి రోగాలతో ఆస్పత్రుల్లో చేరితే కెసిఅర్ అరోగ్య రక్షతో  ప్రజాధనం వృధా. ప్రజారోగ్యం కాపాడే దిశగా చిరుధాన్యాల సాగు, ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యాచరణ లేకపోవటం శోచనీయం.

గిరిజనేతరులకు కూడా పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదే జరిగితే అడవుల రక్షణ కన్నా…అడవులు అంతరించి పోవటమే ఎక్కువగా జరుగుతుంది. గతంలో అటవీ అధికారులపై దాడులకు పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప లాంటి అనేక మంది నేతల చేతుల్లోకి అటవీ భూములు వెళ్తాయి. పోడు భూములు గిరిజనుల చేతుల్లో తక్కువగానే ఉన్నాయి. వారి పేరుతో పెత్తందారుల కబ్జాలో అధికంగా ఉన్నాయి.

రైతుబందు పథకానికి పది నుంచి పదహారు వేలు ఇస్తామని కెసిఆర్ చెప్పటంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది హర్షించదగిన పరిణామమే అయినా…ఓ మతలబు ఉంది. తెలంగాణలో అర ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులు  50 శాతం పైగా ఉంటారు. 30 నుంచి 40 శాతం వరకు ఐదు ఎకరాల రైతులు ఉంటారు. పది నుంచి వందల ఎకరాల వరకు ఉన్న వారు కేవలం పది శాతం మాత్రమే ఉంటారు. ఎలాంటి పరిమితి లేకుండా అందరికి వర్తింప చేయటం..భారీ కుట్ర పూరితమైన ఆలోచన.

రైతుబందు పేరు మీద ప్రజాధనాన్ని బడాబాబులకు దోచిపెట్టేపని సిఎం కెసిఆర్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవటం తప్పు కాదు. ఆ పేరుతో వందల ఎకరాల ఆసాములకు రైతుబందు ఇవ్వటం దేనికి సంకేతం.

కేసీఆర్ బీమా – ప్రతి ఇంటికి ధీమా- తెల్లకార్డు కలిగి ఉన్న ప్రతి పేద ఇంటికి రైతుబీమా తరహాలోనే 5 లక్షల రూపాయల జీవితబీమా ఇస్తామన్నారు సంతోషకరం. గత పదేళ్ళలో ఎంతమందికి కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చారో వెల్లడించలేదు.

ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకువచ్చేందుకు అధ్యయన కమిటీ వేస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం మీద…కెసిఆర్ విధానాల మీద ప్రభుత్వ ఉద్యోగులు పీకల దాక కోపంతో ఉన్నారు. ఆ వర్గం ఈ హామీని నమ్ముతుందని ఎవరైనా అంటే అది అతిశయోక్తే అవుతుంది.

అసైన్మెంట్ భూములపైన పరిమితులు ఎత్తివేసి రైతులకు సంపూర్ణ హక్కులు ఇస్తామన్నారు. ఇది అమలులోకి వస్తే అంతకన్నా మేలు ఇంకొకటి లేదు. అనేక మంది చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుంది.

రెసిడెన్షియల్ పాఠశాలలు డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రెడ్…ప్రతి నియోజకవర్గానికి అగ్రకుల పేదలకు ఒక రెసిడెన్షియల్ గురుకులం మంచి ఆలోచన. పేదరికంలో మగ్గుతున్న వారికి ఉపశమనం ఈ హామీ. అయితే నిర్మాణాలు..ఏర్పాటుతో వదిలేయకుండా సిబ్బంది, మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి సారిస్తే మంచిది.

రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు చేశారు. సిబ్బంది కొరత…భవన నిర్మాణాలు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అనేక కళాశాలలో బోధనా సిబ్బంది లేక వైద్య విద్య కూడా వాన కాలం చదువుల మాదిరిగా తయారైందని విద్యార్థులు, తల్లిదండ్రులు పెదవి విరుస్తున్నారు.

ఆసరా పెన్షన్ల పెంపు : 2,016 రూపాయల నుంచి 5000 రూపాయాలకు పెంచటం శుభ పరిణామం. అప్పుడప్పుడు ఆలస్యం అయినా పెన్షన్ అందుతోంది కనుక లబ్దిదారులు కెసిఆర్ ను కరుణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

సౌభాగ్యలక్ష్మి పథకం – అర్హులైన మహిళలకు 3000 రూపాయల భృతితో మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కెసిఆర్ వేసిన పాచిక ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఇందుకు కలిసి వచ్చే అంశం.

దళిత బంధు కొనసాగిస్తాం అన్నారు. అది కొనసాగినా ఎవరికీ మేలు జరుగుతుంది. తెలంగాణ పల్లెల్లో దళిత బంధు గొప్పతనం ఏంటో దళిత కుటుంబాలను ప్రశ్నిస్తే వేనోళ్ళ విమర్శిస్తున్నారు. అనుచరులకు, అనుంగు సహచరులకే దళితబందు సాయం దక్కుతోందనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రజాకర్షక పథకాలతో ఆర్థిక వృద్ది మందగిస్తుందని…ప్రజలలో నైపుణ్యాలు నశించటం..మానవ వనరుల సద్వినియోగం జరగదని ఆర్థిక వేత్త, నోబెల్ బహుమతి గ్రహిత అమర్త్యసేన్ ఇదివరకే చెప్పారు. ప్రభుత్వ సాయం కోసమే ప్రజలు ఎదురుచూడటం దేశ శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. ఇలా చెప్పినందుకే మన దేశ రాజకీయ పార్టీలు అమర్త్య సేన్ ఇటు వైపు రాకుండా చేశాయి.

-దేశవేని భాస్కర్

Also Read: BRS: కొంతమందికే బీ ఫామ్స్… ఎవరి లెక్కలు వారివి 

RELATED ARTICLES

Most Popular

న్యూస్