ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఏం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలను తొలిచేస్తున్న ప్రశ్న. ఉద్యమ సమయంలో ఎన్నో గెలుపు ఓటములను చూసిన కెసిఆర్…చాలా సాధారణంగా వచ్చి పోయే నేతలతో మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో పార్టీ, నేతల వైపల్యం, స్వయంకృత అపరాధాలు తదితర అంశాలపై నిర్మొహమాటంగా తనను కలిసేందుకు వచ్చిన నేతలతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష హోదాలో గులాబి దండు పోషించాల్సిన పాత్రపై నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారని తెలిసింది.
పార్టీ శాసనసభ పక్ష నేత ఎవరు అనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. ఉన్నవాళ్ళలో సీనియర్ నేతగా కడియం శ్రీహరికి ఇస్తారని వినికిడి. సీనియారిటి, సామాజికవర్గం…విషయపరిజ్ఞానం…కెసిఆర్ ఆలోచనా విధానం తెలిసిన నేతగా కడియం శ్రీహరికి ఇస్తారని అంటున్నారు. కేటిఆర్, హరీష్ రావులలో ఒకరికి ఇస్తే మళ్ళీ కుటుంబానికే పదవులని విమర్శలు ఎదుర్కోవల్సి ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బొటాబొటీ మెజారిటీ ఉండటం గులాబీ దళానికి కలిసివచ్చే అంశమని చర్చ జరుగుతోంది. మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసంతృప్తులు జట్టుకడితే మహారాష్ట్ర మాదిరి ప్రభుత్వ ఏర్పాటుకు చాన్సు ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలే తమకు కలిసివస్తాయని… ప్రభుత్వాన్ని ఎవరు అస్థిర పరచాల్సిన అగత్యం లేదని తెలంగాణ భవన్ వర్గాలు భరోసాతో ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిన నేతగా పేరున్న కెసిఆర్… ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయరని విశ్లేషణ జరుగుతోంది. అదే జరిగితే కెసిఆర్ రాజకీయ చరిత్రలో మాయని మచ్చగా నిలిచే ప్రమాదం ఉంది.
ఇకనుంచి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష హోదాలో కేటిఆర్ శ్రేణులను నడిపించనున్నారు. కీలక సమయాల్లో మాత్రమే కెసిఆర్ జోక్యం చేసుకుంటారని, రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాలపై దృష్టి సారిస్తారని పార్టీ నేతలు అంటున్నారు. ఇందులో భాగంగా మెదక్ నుంచి లోకసభకు పోటీ చేస్తారని తెలిసింది. మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు.
కెసిఆర్ స్థాయికి లోకసభలో ఉంటే జాతీయ స్థాయిలో పార్టీ పరపతి పెంచేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. శాసనసభలో కేటిఆర్, హరీష్ రావు… శాసనమండలిలో కవిత ఉంటారు కనుక ఢిల్లీ రాజకీయాల్లో పాలు పంచుకునేందుకు కెసిఆర్ ఆసక్తి చూపుతున్నట్టు సమాచాం. మరోవైపు బీఆర్ఎస్… ఎన్.డి.ఏ కూటమిలో చేరనుందని హస్తినలో ప్రచారం జరుగుతోంది.
మూడో దఫా అధికారంలోకి రాగానే పొరుగు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ కోసం ప్రణాలికలు సిద్దం చేశారు. విశాఖపట్నంలో జనవరిలో భారీ బహిరంగసభ నిర్వహించాలని…తద్వార ఏపిలో పార్టీని బలోపేతం చేసి…అవకాశం ఉన్న చోట ఎన్నికల రణంలో తలపడేందుకు కార్యాచరణ రూపొందించారని విశ్వసనీయ సమాచారం. మహారాష్ట్రలో ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా అక్కడ పోటీకి దిగాలని…ప్రజల్లో బలం కలిగిన నేతలను గుర్తించే పని ఇప్పటికే మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో అధినేత వైఖరి ఏంటో శ్రేణులకు అంతుపట్టడం లేదు. ఎన్నో మలుపులను చూసిన కెసిఆర్ ఓటమికి కారణాలను విశ్లేషించి…భవిష్యత్తుపై భరోసాతో సాగుతారని ఆయన మనస్తత్వం తెలిసిన నేతలు అనుకుంటున్నారు.
-దేశవేని భాస్కర్