Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే ఈ కల్లాల నిర్మాణాన్ని కావాలనే కేంద్ర ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. ఇంత మంచి కార్యక్రమం కోసం రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సహాయాన్ని ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నందుకు, రాష్ట్రం పైన అసత్య ప్రచారం చేస్తున్నందుకు రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ కార్యక్రమాలకు అనుసంధానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పదుల సార్లు విజ్ఞప్తి చేసిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ప్రభుత్వం తరఫున పలుమార్లు కేంద్రానికి లేఖలు సైతం రాశామన్నారు. పార్టీ తరఫున కూడా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించామని కేటీఆర్ చెప్పారు. వ్యవసాయ అనుబంధ పనులను ఉపాధి హామీకి అనుసంధానం చేయడం పక్కనపెట్టి మొత్తం పథకాన్ని నీరు కార్చేలా అనేక షరతులు, కోతలను కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేర్చిందన్నారు. గ్రామాలలో కొవిడ్ కష్టకాలం తర్వతా ఉపాది అవకాశాలు తగ్గాయని, గ్రామీణ అర్ధిక వ్యవస్ధ సంక్షోభంలో చిక్కుకుంటున్నా, కేంద్రం మాత్రం ఉపాధి హమీకి నిధులు తగ్గిస్తూ వస్తున్నదని విమర్శించారు. మరోపైపు పెరిగిన ఎరువులు పెట్రోల్ ధరలు, ఇతర ఖర్చుల పెరుగుదల వలన వ్యసాయరంగం పంట పెట్టుబడులు పెరుతున్నాయని, కనీసం ఇప్పుడైన రైతులను అదుకునేందుకు వ్యవసాయంతో ఉపాధి హమీని అనసంధానం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో రైతులు కట్టుకున్న వ్యవసాయ కల్లాలతో కలుగుతున్న ప్రయోజనాలను పట్టించుకోకుండా తెలంగాణపై గుడ్డి వ్యతిరేకతతో ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని మోడీ ప్రభుత్వం మొండిపట్టు పట్టడం దుర్మార్గం అని కేటీఆర్ మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాతకోసం కల్లాలు నిర్మిస్తే… మోడీ సర్కారు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నదని విమర్శించారు. తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలలో చేపలు ఎండబెట్టుకునేందుకు ఇదే తరహా సిమెంట్ కల్లాలను ఉపాధి హామీ పథకంలో భాగంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన విషయాన్ని కేంద్రానికి గుర్తు చేసినా పట్టించుకోవడంలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులంటేనే కేంద్రానికి గిట్టడం లేదన్నారు. కేవలం తెలంగాణ మీద వివక్షతోనే పనికిమాలిన షరతులను మోడీ సర్కారు తెరపైకి తెస్తుందని మండిపడ్డారు. ఇందులో భాగంగా 750 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలో నిర్మించాలనుకున్న 79000 వ్యవసాయ కల్లాల నిర్మాణాలను మోడీ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. ఉపాధి హామీ పనులతో రైతులు ఉపయోగం జరిగితే తప్పా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.

వ్యవసాయ రంగంలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని కేటీఆర్ అన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో రైతులకి నేరుగా డబ్బులు అందించే రైతు బంధు కార్యక్రమం తో మొదలుకొని రైతు బీమా, 24 గంటల వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఉపాధి హామీని సాధ్యమైనంత ఎక్కువగా వినియోగించుకుంటున్న తమ ప్రభుత్వ సదుద్దేశానికి మోడీ ప్రభుత్వం దురుద్దేశాలు ఆపాదిస్తుందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ ప్రగతి పైన ఉన్న గుడ్డి వ్యతిరేకతతో కేంద్రం కక్ష కట్టిందన్నారు. వ్యవసాయ రంగ అనుబంధ పనులకు ఉపాధి హామీ నిధులను ఖర్చు చేయవచ్చన్న నిబంధన ఉన్న కేవలం తెలంగాణ రాష్ట్ర రైతులపై కక్ష సాధించేందుకు మాత్రమే నిధులు మళ్లింపు అంటూ మోడీ సర్కారు దుష్ప్రచారం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. రైతులకు మేం సాయం చెయ్యం.. చెయ్యనీయంఅన్నట్టుగా కేంద్రం తీరు..ఉందన్నారు.

మన రైతుల కోసం బావుల కాడ వడ్లు ఆరబెట్టుకోడానికి తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మించాలని అనుకోవడం నేరమా!! అన్న కేటీఆర్, మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని మరో కుట్రకు తెర లేపిందన్ననారు. తెలంగాణ ప్రభుత్వం కల్లాలు నిర్మిస్తే ఆ నిధులు వెనక్కి ఇవ్వమని అడగడం ఇదేనా బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న ప్రేమ అని ప్రశ్నించారు. రైతులకు అత్యంత ఉపయుక్తంగా ఉన్న వ్యవసాయ కల్లాల నిర్మాణం కి ఖర్చయిన 151 కోట్లను తిరిగి చెల్లించాలని కేంద్రం రాష్ట్రానికి నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఈ వివక్షపూరిత వ్యతిరేక వైఖరికి నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తెలంగాణ రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని, వీరితోపాటు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించాలని కేటీఆర్ కోరారు.

Also Read : ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు : మంత్రి కేటీఆర్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com