హిందూపురం చరిత్ర రాస్తే అందులో బి ఎస్ ట్రాన్స్ పోర్ట్ కు, దాని ఎత్తు పల్లాలకు, దానికి కర్త కర్మ క్రియ అయిన బి ఎస్ టి శ్రీధర్ కు కొన్ని పేజీలు కేటాయించాల్సిందే. ఒక ఊరి చరిత్రలో ఒక ప్రయివేట్ బస్సుల సంస్థకు ఏమి పాత్ర ఉంటుందని ఎవరికైనా అనిపించవచ్చు. అలాంటి ప్రయివేటు వాహనాల సంస్థలు, అంతకంటే పెద్దవి ఇప్పుడు ప్రతి పట్టణంలో, నగరంలో వీధికొకటి ఉంటాయి. లాభనష్టాలు, ప్యాసెంజర్ ఆక్యుపెన్సీ లెక్కలు, బస్సుల్లో ఆధునిక వసతుల పోలికలు, వేళకు బస్సులు నడవడంలాంటి సాధారణ కొలమానాలను దాటి బి ఎస్ టీ ని చూడాలి.

స్వాతంత్ర్యానికి కొద్దిగా ముందు కర్ణాటక సరిహద్దు గ్రామం బ్యాల్యా నుండి హిందూపురానికి వచ్చి నాలుగు బొగ్గు బస్సులు పెట్టిన బ్యాల్యా శ్రీకంఠయ్య ప్రయత్నమే దానికదిగా ఒక సాహసం. సంప్రదాయ కుటుంబంలో పెరిగిన వ్యక్తి ఇలా రోడ్లమీద బొగ్గులు మండించి బస్సులను కదిలించే మసి పనుల్లోకి దిగడం నిజంగా ఒక తెగింపు. ఆ క్షణం నుండి బి ఎస్ టీ అంటే కర్ణాటక- ఆంధ్ర రాష్ట్రాల పల్లెల, పట్టణాల మధ్య వారధి. ఆ క్షణం నుండి బి ఎస్ టీ మోసిన భారాన్ని, చేర్చిన గమ్యాలను లెక్కకట్టడానికి రవాణా శాఖ దగ్గరున్న ప్రమాణాలు ఏమి సరిపోతాయి? దశాబ్దాలపాటు ఎన్ని వేల, బహుశా లక్షలమంది విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు ఇచ్చి వాళ్ళ విద్యాప్రయాణానికి దారులు వేసిందో రవాణా శాఖ చెప్పగలదా? శుభాశుభాలకు హిందూపురం చుట్టుపక్కల ఎంతమంది బి ఎస్ టీ ఆర్ధిక సాయం పొందారో రవాణా శాఖ చెప్పగలదా? ఎన్ని ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు బి ఎస్ టీ ఊపిరులూదిందో రవాణా శాఖ చెప్పగలదా? చెప్పలేదు. చెప్పడానికి దాని పని అది కాదు.
శ్రీకంఠయ్య మరణం తరువాత పెద్ద కొడుకుగా బి ఎస్ శ్రీధర్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీని తన భుజాన వేసుకుని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. తండ్రిబాటలోనే దానధర్మాలు చేస్తూ వచ్చారు. పరమ సాత్వికుడు. కానీ స్థిరమైన అభిప్రాయాలేవో ఉన్నాయి. అందరికీ అర్థమైనట్లే ఉంటారు. ఎవరికీ అర్థం కారు. బి ఎస్ టీ సోదరులు హిందూపురం కోటీశ్వరులుగా ఎదిగారు. శ్రీధర్ తమ్ముడు విద్యాసాగర్ తెలుగుదేశం హయాములో హిందూపురం మునిసిపల్ చైర్మన్ గా పనిచేశారు. బహుశా అన్నదమ్ములు అస్తిపంపకాలు చేసుకుని గౌరవంగా ఎవరికి వారు వేరుపడ్డారు. ఒకప్పుడు ఉన్నన్ని బస్సులు ఇప్పుడు లేకపోయినా ట్రాన్స్ పోర్ట్ కంపెనీని, పెట్రోల్ బంకును బి ఎస్ కాశీ విశ్వనాథ్(అప్పీ) నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా శ్రీధర్ జనజీవన స్రవంతికి దూరంగా ఉన్నారు. సంతానం లేదు. ఎనభై దాటిన వయసులో ఈనెల 20 న హిందూపురంలో తుదిశ్వాస వదిలారు.

జిల్లాలో బి ఎస్ టీ తరువాత వచ్చిన ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు ఒక వెలుగు వెలుగుతూ బి ఎస్ టీ పేరుకు నడుస్తున్న కంపెనీగా మారడం వెనుక కారణాలు ఇక్కడ అనవసరం. ఎంత పెద్ద హోదాల్లో ఉన్నవారైనా హిందూపురం వస్తే శ్రీధర్ ఇంటికి వెళ్ళి మాట్లాడడం ఆనవాయితీ. అదీ ఆయన నిర్మించుకున్న గౌరవదుర్గం. విధి విచిత్రమైనది. ఆ దుర్గానికి బీటలు వారాయి. శ్రీధర్ కంట్లో పడితే చాలని వేచి చూసిన వాళ్లే…ఎక్కడ ఆయన ఎదురుపడతాడో అని తప్పించుకుని తిరిగారు. చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసిన ఆయన చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు. ప్రతి మనిషిలో లోపాలు సహజం. అలాగే ఆయనలోనూ కొన్ని లోపాలు ఉండి ఉండవచ్చు. కానీ ఆయన చేసిన మంచి, విద్యాదానాలు, ఇతర సహాయాలు మాత్రం ఎప్పటికీ మిగిలి ఉంటాయి. ఇంటర్మీడియేట్ చదివేరోజుల్లో లేపాక్షి- హిందూపురం మధ్య తిరగడానికి నాకు బి ఎస్ టి ఫ్రీ బస్ పాస్ రాసిచ్చి…అనేకసార్లు రెన్యూవల్ కూడా చేసిన శ్రీధర్ స్వామి(హిందూపురంలో ఆయన్ను అందరూ అలాగే పిలుస్తారు)మృతికి నివాళిగా ఈ నాలుగు మాటలు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

