ఒకప్పుడు హోటల్‌కు వెళ్లినా, సినిమాకు వెళ్లినా ‘ఒక్కడే వచ్చాడేంటి?’ అని వింతగా చూసేవారు. ఏవైనా ఈవెంట్లకు తోడు లేకుండా వెళ్తే అది ఏదో వెలితిగా భావించేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఆ వింత చూపుల స్థానంలోకి విలక్షణమైన లైఫ్ స్టైల్ వచ్చి చేరింది. తోడు కోసం వేచి చూసే రోజులు పోయాయి.. తన తోడు తనే అని చాటిచెప్పే ‘సోలో’ కాలం మొదలైంది. తినడానికి ఒక్కరే.. తిరగడానికి ఒక్కరే.. ప్రయాణాలూ ఒక్కరే! ఇది అభాగ్యుల ఒంటరితనం కాదు.. తనని తాను ప్రేమించుకునే సరికొత్త సామాజిక సంస్కృతి.
ఎవరూ లేక కాదు.. ఎవరితోనూ సర్దుబాటు కాక!
ఈ సోలో ట్రెండ్‌ను ఎంచుకుంటున్న వారు ఎవరూ లేని అభాగ్యులు కాదు. ఎవరి కోసమో తమ ఇష్టాలను చంపుకోకూడదని, తమ సమయంపై తమకే సర్వహక్కులు ఉండాలని భావించే రకం. తనకు నచ్చిన దారిలో, తనకు నచ్చిన వేగంతో వెళ్లడమే అసలైన స్వేచ్ఛ అని వీరు నమ్ముతున్నారు. మునుపటిలా “ఎవరైనా కలిసి వస్తే వెళ్దాంలే..” అని వేచి చూసే ఓపిక నేటి తరానికి లేదు. ఎవరితోనూ సంబంధం ఉండదు.. ఎవరితోనూ సర్దుబాటు ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ‘స్వీయ చికిత్స’ (Self-Therapy).

కన్నేసిన మార్కెట్- మీ ఏకాంతం…వారి వ్యాపారం!
ఈ సోలో ట్రెండ్‌ను సామాన్యుల కంటే ముందుగా కార్పొరేట్ లోకం పసిగట్టేసింది. రాబోయే కాలంలో సమాజాన్ని ముంచెత్తనున్న పెద్ద వేవ్ ఇదేనని కనిపెట్టేసింది. నిన్నటి వరకు ‘ఫ్యామిలీ ప్యాకేజీల’ చుట్టూ తిరిగిన మార్కెట్, ఇప్పుడు ‘ఒంటరి కెరటాల’ వైపు మళ్లింది. రెస్టారెంట్లలో సింగిల్ టేబుల్ రిజర్వేషన్ల నుంచి, సోలో ట్రావెల్ డీల్స్ వరకు అన్నీ మారిపోతున్నాయి. 2030 నాటికి సోలో ట్రావెల్ మార్కెట్ విలువ అక్షరాలా 359 కోట్ల రూపాయలు దాటుతుందన్న అంచనా వ్యాపార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
గణాంకాలు చెబుతున్న సత్యం
- సినిమాలు & వినోదం: గత ఏడాది అక్షరాలా 18 లక్షల మంది ఒక్కరే సినిమాలకు, లైవ్ ఈవెంట్లకు వెళ్లారు. అంటే తోడు లేకపోయినా వినోదాన్ని ఆస్వాదించడంలో వెనకాడటం లేదు.
- మహిళా యాత్రికులు: ఉదయ్‌పూర్, కూర్గ్, సిక్కిం వంటి ప్రాంతాలకు మహిళలు ఒంటరి ప్రయాణాలను (Solo Trips) ఎంచుకుంటున్నారు. ‘ఉమెన్ ఓన్లీ’ ట్రిప్స్ బుకింగ్స్ 40 శాతం పెరగడం విశేషం.
- ఒంటరి గృహాలు: 2030 నాటికి భారత్‌లో ఒంటరిగా నివసించే వారి సంఖ్య కోటి 74 లక్షలకు చేరుకోవచ్చని డేటా చెబుతోంది.

కంపెనీల రూటు మార్పు
మార్కెట్ గాలి ఎటు వీస్తుందో అర్థం చేసుకున్న జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు ‘సింగిల్ టేబుల్’ రిజర్వేషన్లకు పెద్దపీట వేస్తున్నాయి. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫారమ్స్ ఫ్యామిలీ టికెట్ల కంటే సింగిల్ టికెట్ బుకింగ్స్ పెరగడాన్ని గమనించాయి. పికిల్ బాల్ వంటి క్రీడల్లో కూడా 85 శాతం మంది సోలో ప్లేయర్లే ఉండటం గమనార్హం. ఇది ఖర్చు తగ్గించుకోవడం కాదు, ఎంతైనా ఖర్చు పెట్టి ఏకాంతాన్ని, ప్రశాంతతను కొనుక్కోవడమే ఈ సోలో ట్రెండ్ వెనుక ఉన్న అసలు రహస్యం.
మొత్తానికి భారతీయ సమాజంలో ‘జంట’ల సంస్కృతి పక్కకు జరిగి, ‘సింగిల్’ వైభవం మొదలవుతోంది. ఒకప్పుడు ఏకాంతం అంటే భయం.. ఇప్పుడు అదే ఏకాంతం ఒక విలాసం!

