Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమొఘల్ చక్రవర్తుల మనసు గెలిచిన ముంగండ జగన్నాథ పండితరాయలు

మొఘల్ చక్రవర్తుల మనసు గెలిచిన ముంగండ జగన్నాథ పండితరాయలు

ఆయన ప్రార్థిస్తే కాశీలో గంగ పొంగి ఆయన దగ్గరికే వచ్చింది. ఆయన తెలుగువాడు. కానీ ఆయన పాండిత్యానికి మెచ్చి మొఘలులే తమ ఆస్థానంలో పండితుడిగా పెట్టుకుని ఆదరించారు. భారతీయ సాహిత్య అలంకార శాస్త్రానికి దారిదీపమైన రసగంగాధర తిలకం రాసిన జగన్నాథ పండితరాయలు పుట్టింది మన ఆంధ్ర గోదారితీర కోనసీమ ముంగండలో. తెలుగు పల్లెనుండి ఢిల్లీ వరకు ఆయన ప్రయాణం ఒక అద్భుత కావ్యం!

బాల్యం – వివాహం

1600 ప్రాంతంలో జన్మించిన జగన్నాథుడు, ఆంధ్రుడు, వేగినాటివాడు. తూర్పు గోదావరి జిల్లా ముంగండ నివాసి. గోదావరి తీరంలో ఉన్న ఈ అగ్రహారం ఆ రోజుల్లోనే సకల శాస్త్రాలకు నిలయం. సనాతన సంప్రదాయంలో కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పెరిగిన ఆయన, శాస్త్రాలతో పాటు సంగీతంలోనూ ఆరితేరాడు. చిన్నతనంలోనే ముంగండ నివాసి అయిన కామేశ్వరితో ఆయన వివాహం జరిగింది.

ఇంటిపేరు వివాదం – ‘ఉపద్రష్ట’ వంశీయుడే!

పండితరాయల ఇంటిపేరుపై గతంలో పండితుల్లో భిన్నాభిప్రాయాలు ఉండేవి. కొందరు ‘ముక్కామల’ అని, మరికొందరు ‘నడిమింటి’ అని భావించినా, చివరకు ఆయన ‘ఉపద్రష్ట’ వంశీయులని అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు.

తండ్రే మహాగురువు!

ఆయన తండ్రి పేరిభట్టు (లక్ష్మీకాంత భట్టు), తల్లి మహాలక్ష్మి. తండ్రి స్వయంగా గొప్ప పండితుడు. జగన్నాథుడు తండ్రి దగ్గరే వేదాంతం నేర్చుకోవడమే కాకుండా, ప్రాథమిక విద్య స్థాయిలోనే ప్రతి విషయాన్ని తర్కంతో విశ్లేషించడం అలవరుచుకున్నాడు. తరువాత మహేంద్రుడి దగ్గర న్యాయ-వైశేషికాలు, ఖండదేవుడి దగ్గర జైమినీయం, శేష శ్రీకృష్ణ పండితుడి దగ్గర వ్యాకరణం చదువుకున్నాడు. ముఖ్యంగా తన తండ్రి పాండిత్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. రాళ్ల నుండి అమృతం చిందేలా కవిత్వం చెప్పగల సమర్థుడట పేరిభట్టు. ఈ విషయాన్ని తన రసగంగాధరం కావ్యంలో ఈ శ్లోకం ద్వారా వివరించాడు.

“శ్రీమత్ జ్ఞానేంద్ర భిక్షో రథిగత సకల బ్రహ్మ విద్యా ప్రపంచః
కాణాదీ రాక్ష పాదీ రపి గహన గిరోయో మహేంద్రా ద వేదిత్
దేవాదే వాద్య గ్రీష్మ స్మరహర నగరే శాసనం జైమినీయం
శేషాంక ప్రాప్త శేషామల భణితి రభూ త్సర్వ విద్యా ధరోయః
పాషాణాదపి పీయూషం స్యందతేయస్య లీలయా
తం వందే పేరు భట్టాఖ్యం లక్ష్మీకాంతం మహాగురుం”.

హయగ్రీవోపాసన

పండితరాయలు పరమ హయగ్రీవ భక్తుడు. కాశీ విద్యాభ్యాస సమయంలో అప్పటి మేధావులనే ఆయన ఆశ్చర్యపరిచాడు. అప్పయ్య దీక్షితుల్లాంటి సమకాలీన పండితులతో ఆయనకు శాస్త్ర చర్చలు జరిగేవి. ఆయన పాండిత్యం ఎంతటిదంటే.. సాక్షాత్తు బృహస్పతి లేదా సరస్వతీ దేవి ఎదురుగా నిలబడినా, తడబడకుండా వాదించగల ధీశక్తిని ఆయన పొందాడు. ‘రసగంగాధరం’లో ఆయనే ఇలా చెప్పుకున్నాడు.
“అపివక్తి గిరాంపతి: స్వయం యది తాసా మధిదేవతా పినా
అ యమస్మి పురోహ యావన స్మరణో ల్లంఘిత వాగ్మయాం బుధి:”
భావం:- హయగ్రీవ మంత్ర స్మరణతో వాజ్మయ సముద్రాన్ని దాటి నేను ఎదురుగా నిలబడ్డాను.. ఆ బృహస్పతిని గానీ, సరస్వతీ దేవిని గానీ రమ్మనండి, నేను సిద్ధం అన్నట్టుగా ఆయన పాండిత్య గరిమ ఉండేది.

షాజహాన్ కొలువులో ‘పండితరాజ’ పట్టం

1628లో షాజహాన్ కొలువులో చేరాడు. ఈ మేధావి ఖ్యాతి కాశీ దాటి మధుర, ఆగ్రాలకు పాకడంతో చక్రవర్తి జహంగీర్ కు వార్త చేరింది. అనంతరం షాజహాన్ ఆయనను విశేషంగా ఆదరించాడు. అరబ్బీ, పారసీక భాషలు, హిందూస్తానీ సంగీతంలో ఆయనకున్న ప్రజ్ఞ చూసి చక్రవర్తి ముగ్ధుడయ్యాడు. ‘పండితరాజ’ (పండితులలో రాజు) అనే బిరుదును స్వయంగా చక్రవర్తి షాజహాన్ ప్రసాదించాడు. అప్పట్లో ఉత్తరాది వారు మనవారిని చూసి “ఏ పండిత్ రాజ్ కే దేశ్ వాసీ హై” (వీరు పండితరాయల దేశం వారు) అని గౌరవంగా పిలిచేవారట!

రచనలు – భారతీయ సాహిత్య అలంకార శాస్త్ర శిఖరం

షాజహాన్ కొలువులో ఉండగానే ఆయన ‘రసగంగాధరం’ రాశాడు . ఇది అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ భారతీయ సాహిత్య అలంకార శాస్త్రంలో తిరుగులేని ప్రామాణిక లక్షణ గ్రంథం. కవితాసతి నొసట ఇది ఒక నిత్య రసగాంగాధర ‘తిలకం’ లాంటిది.

ప్రేమ – విరహం – వైరాగ్యం: ‘కామేశ్వరి’ స్థానం!

జగన్నాథుడు తన భార్య కామేశ్వరిని అమితంగా ప్రేమించాడు. ఆయన తన కావ్యం ‘భామినీ విలాసం’ ద్వారా తన దాంపత్య సౌరభాన్ని లోకానికి చాటారు. కామేశ్వరి మరణం ఆయనను తీవ్రంగా కలచివేసింది. ఒక మహా పండితుడు సైతం సామాన్యుడిలా విలపించేలా చేసింది. 40 ఏళ్ల ప్రాయంలోనే భార్యా వియోగం కలిగింది.
“వయసి గతవతి వనితా రహితం హృదయం దహంతి దుశ్చింతా:
ఇతి మన్వానేన మయా త్యక్తవతీ సా పి కామేశ్వరి!”
భావం:- “ఓ కామేశ్వరి! వయసు పైబడిన తర్వాత భార్య లేని హృదయం చింతలతో దహిస్తుందని తెలిసి కూడా, నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయావా?” అని ఆయన ఆవేదన చెందాడు.

రాజనీతి – చక్రవర్తికి హెచ్చరిక

షాజహాన్ ఆంతరంగిక సలహాదారుగా ఉంటూనే, చక్రవర్తిని కల్పవృక్షంతో పోలుస్తూనే.. ‘పాత్రాపాత్ర వివేకం’ ఉండాలని హెచ్చరించేవాడు .
“యైస్త్వం గుణగణ వాన పి సతాం ద్విజి హ్వాయి ర సేవ్యతాం నీతః
తానపి వాహసి పటీరజ కిం కథ యామస్త్వదీయ మౌన్నత్యం”
భావం:- ఓ చందన వృక్షమా! నిన్ను ఆశ్రయించి ఉన్న విష సర్పాలను (దుర్మార్గులను) కూడా భరిస్తున్నావు.. నీ గొప్పతనం ఏమని చెప్పను? (చక్రవర్తి చుట్టూ ఉన్న దుష్టుల గురించి హెచ్చరిక).
“ఢిల్లీశ్వరోవా జగదీశ్వరోవా మనోరథాన్ పరిపూరయితం సమర్థ:
అన్యై: నృపాలై: పరదీయమానం శాకాయ వాస్యా ల్లవణాయ వాస్యాత్”
భావం:- నా కోరికలు తీర్చగలిగితే ఢిల్లీశ్వరుడు లేదా జగదీశ్వరుడే తీర్చాలి. ఇతర రాజులు ఇచ్చేది ఉప్పుకు, కూరకు కూడా సరిపోదు.

అసూయపరుల కుట్ర – లవంగి వివాదం

ఆయన కీర్తిని చూసి అసూయపడిన వారు, షాజహాన్ కుమార్తె లవంగితో ఆయనకు సంబంధం అంటగట్టారు. కానీ, నిజానికి ఆయన తన భార్య కామేశ్వరితో అత్యంత అన్యోన్యంగా ఉండేవాడని, ఆమెను గూర్చి రాసిన శ్లోకాల ద్వారా స్పష్టమవుతోంది. ఆయన పవిత్రతను గంగానదే స్వయంగా నిరూపించింది.

కవిత్వానికి అసలైన నిర్వచనం

సారం లేని కవిత్వం రాసేవారిని ఆయన కఠినంగా హెచ్చరించేవాడు. రసం జాలువారాలి, మనసు కరగాలి, రమణీయమైన అర్థం ఉండాలి.. అప్పుడే అది కవిత్వం అని ఆయన భావన.
“నిర్మాణే యది మార్మికోసి…”
భావం:- నీవు కవిత్వ నిర్మాణంలో సిద్ధహస్తుడవైతేనే మా ముందుకు రా.. లేదంటే ఆ పదాలను మనసులోనే ఉంచుకో, బయటపెట్టి పాపం చేయకు.

ప్రసిద్ధ రచనలు – పంచలహరులు

ఆయన ఐదు ప్రధాన కావ్యాలు రచించాడు :
1. అమృత లహరి (యమునా స్తుతి)
2. కరుణా లహరి (విష్ణు స్తుతి)
3. లక్ష్మీ లహరి (బీజాక్షర సహితం – నేటికీ పవిత్ర పారాయణ గ్రంథం)
4. సుధా లహరి (సూర్య స్తుతి)
5. గంగా లహరి (గంగా స్తుతి)

గంగా లహరి – ప్రకృతి ఇచ్చిన గౌరవం

జీవిత చరమాంకంలో జగన్నాథుడు తిరిగి కాశీకి వచ్చాడు. కానీ పండిత లోకం ఆయనకొచ్చిన పేరుప్రఖ్యాతులకు అసూయతో ఆయనను తక్కువ చేసి చూసింది. అప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని ఆయన 52 శ్లోకాలతో ‘గంగా లహరి’ పఠించడం మొదలుపెట్టాడు . ఒక్కో శ్లోకానికి గంగమ్మ ఒక్కో మెట్టు పైకి ఎగసిపడింది. 52వ శ్లోకం పూర్తయ్యేసరికి గంగామాత జగన్నాథుడిని తన గర్భంలో కలిపేసుకుంది. ఇది ఒక మహాకవికి ప్రకృతి ఇచ్చిన అత్యున్నత గౌరవం.

మహాజ్ఞాని

చివరి దశలో మథురలో నివసిస్తూ, “ఢిల్లీశ్వరుని ఆదరణ పొందాను, శాస్త్రాలు చదివాను, ఇప్పుడు హరిని సేవిస్తూ తృప్తిగా ఉన్నాను” అని ప్రకటించుకున్నాడు. 74వ ఏట ఆయన కన్నుమూశాడు.
తెలుగు నేల కన్న ఒక అసాధారణ మేధావి, అరివీర పండిత భయంకరుడు జగన్నాథ పండితరాయలు. ముంగండ అగ్రహారం నుండి దిల్లీ సుల్తానుల అంతఃపురాల వరకు ఆయన ప్రస్థానం ఒక అద్భుతం. ముంగండ మట్టిలో పుట్టి, ఢిల్లీ కోటలో జెండా ఎగురవేసి, కాశీ గంగలో కలిసిపోయిన జగన్నాథ పండితరాయల గాథ మన తెలుగు గడ్డకే గర్వకారణం. ఆయన జీవితం మనకు ఇచ్చే సందేశం ఒక్కటే: “ప్రతిభ ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు, భక్తి ఉంటే పరమాత్మను పొందవచ్చు.” అని.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular