వైఎస్సార్సీపీ అనకాపల్లి లోక్ సభ అభ్యర్ధిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మాడుగుల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న బూడి ముత్యాల నాయుడును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ముత్యాల నాయుడు 2014, 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మాడుగుల నుంచి రెండుసార్లు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందారు.
2022 ఏప్రిల్ 11 న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో బూడి ముత్యాల నాయుడు ను సిఎం జగన్ కేబినేట్ లోకి తీసుకున్నారు. కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలను అప్పగించారు.
అయితే ఈనెల 16న విడుదల చేసిన పార్టీ ఎమ్మెల్యే, ఎంపి అభ్యర్ధుల జాబితాలో ఒక్క అనకాపల్లి ఎంపి సీటును మాత్రమే పెండింగ్ లో ఉంచారు వైసీపీ అధినేత జగన్. బిజెపి-టిడిపి-జనసేన పొత్తులో భాగంగా ఈ సీటులో బిజెపి పోటీ చేస్తోంది. ఆ పార్టీ నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ ను అభ్యర్ధిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
సామాజిక సమీకరణాల్లో భాగంగా సిఎం రమేష్ కు పోటీగా బూడి ముత్యాల నాయుడును బరిలోకి దింపాలని జగన్ నిర్ణయించారు. కాగా, మాడుగుల అసెంబ్లీ స్థానానికి బూడి కుమార్తె ఈర్ల అనురాధను ప్రకటించారు. ఒకే పార్లమెంట్ నియోజజవర్గ పరిధిలో లోక్ సభకు తండ్రి, అసెంబ్లీకి కుమార్తె పోటీ చేస్తుండడం విశేషం.