Saturday, April 13, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమైండ్ యువర్ లాంగ్వేజ్

మైండ్ యువర్ లాంగ్వేజ్

భావ ప్రసారానికి భాష ఒక్కటే సాధనం. మనుషులు మాత్రమే భాషతో భాషించగలుగుతారు. అంటే కుక్కలు, నక్కలు, చిలుకలు, నెమళ్లది భాష కాదు అని తీర్మానించడానికి వీల్లేదు. యుగయుగాలుగా వాటి భాషలో అవి మాట్లాడుకుంటూ బతకగలుగుతున్నాయి. మన భాష మనకు గొప్పది. సహజంగా వాటి భాష వాటికి గొప్పదే అయి ఉంటుంది. కలవారి ఇళ్లలో కుక్కలు ఇంగ్లీషులోనే భౌ భౌ భాష మాట్లాడతాయి. నిరుపేదల ఇళ్లల్లో ఆవులు అంబా అని నిరుపేద భాషలోనే దీనంగా మాట్లాడతాయి. చెబితే బాగోదు కానీ- భాష కూడా అధికారానికి, కండబలానికి భయపడి, ఆ పరిధులకు లోబడి ఉంటుంది. అందుకే పేదవాడి కోపం పెదవికి చేటు.

హనుమంతుడు పెదవి విప్పి రెండు మాటలు మాట్లాడితే- రాముడు ప్రశంసాపూర్వకంగా ఎన్ని సర్టిఫికెట్లు ఇచ్చాడో? నవ వ్యాకరణ పండితుడు, మూడు వేదాల నిష్ణాతుడు, అనేక భాషల్లో ప్రావీణ్యమున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు అన్నాడు. ఇక రాముడి భాష,  అంద చందాలకు ఆకాశమే హద్దు. మృదువుగా, ప్రీతిగా మాట్లాడతాడు. నవ్వుతూ ముందుగా తనే పలకరిస్తాడు. మాట్లాడుతున్న సబ్జెక్ట్ ను బట్టి ముఖ కవళికలుంటాయి. కళ్లు కూడా మాట్లాడతాయి. మాటల్లో తేనె చినుకులు దొర్లుతాయి. నవ్వితే ముత్యాలు దొర్లుతాయి.

వేదానికి శబ్దమని మరో పేరు. ఆ శబ్దానికి ఊపిరి ఆధారం. శరీర నిర్మాణ శాస్త్ర ప్రకారం కూడా ఊపిరితిత్తుల్లో గాలి స్వర పేటిక గుండా బయటికి వస్తున్నప్పుడు ధ్వనిగా రూపాంతరం చెందుతుంది. గొంతు అడుగున కొన్ని, నాలుక చివర కొన్ని, పళ్ల మధ్య కొన్ని, పెదవుల చివర కొన్ని ఇలా ఒక్కో చోట కొన్ని ధ్వనులు పుడతాయి. ఆయా ధ్వనులు పుట్టే చోటును బట్టి మన వ్యాకరణం వాటికి విడి విడిగా పేర్లు పెట్టింది. భాషా శాస్త్రం, భాషోత్పత్తి శాస్త్రాలు ఒకప్పుడు చదవదగ్గ పెద్ద సబ్జెక్టులు. కోర్సులు. ఇప్పుడు టెంత్ వరకు తప్పనిసరి అయితేనే భాషలు చదవాల్సిన అంశాలు. తరువాత సకల అంశాలు కంప్యూటర్లోనే లయిస్తాయి కాబట్టి- భాష మూగబోయి కంప్యూటర్ అలెక్సా యాంత్రిక చిలుకపలుకల భాష ఒక్కటే మిగిలి ఉంటుంది.

భాసించేది, వెలిగేది, వెలుగులను పంచేది, ప్రవహించేది- భాష. భారత దేశంలో లెక్కలేనన్ని భాషలు. ఎవరి భాష వారికి గొప్ప. అయితే ప్రపంచ వ్యాప్తంగా చెల్లుబాటు అయ్యే ఇంగ్లీషు నేర్చుకోవడం ఇప్పుడు తప్పనిసరి. సాంకేతిక విద్యలకు జర్మనీ పెట్టింది పేరు. జర్మనీలో చదవాలంటే ఎంతో కొంత జర్మన్ భాష వచ్చి ఉండాలని నియమం. అలాగే జపాన్. మిగతా దేశాలతో పోలిస్తే ఏక కాలంలో అనేక భాషలు నేర్చుకోవడానికి భారతీయులకే ఎక్కువ అవకాశాలున్నాయి. మాతృ భాష తెలుగు, కన్నడ, తమిళం ఎలాగూ వస్తుంది. ఇంగ్లీషు మీడియం చదువులే కాబట్టి ఇంగ్లీషు వస్తుంది. ఏ మాత్రం ఇష్టమున్నా ఎంతో కొంత వ్యవహార భాషగా హిందీ వస్తుంది. వీటికి తోడు ఫ్రెంచ్, జపాన్ భాషలు నేర్చుకుంటున్న విద్యార్థులు పెరుగుతున్నారని ఈనాడు ఒక వార్తను ప్రచురించింది. అంతర్జాతీయంగా ఏ యే భాషలు నేర్చుకుంటే ఉపాధి అవకాశాలున్నాయో వివరించింది. మంచిదే.

https://www.eenadu.net/telugu-article/education/general/0301/97498

సగటు వ్యక్తిలా, మౌన మునిలా ఉండి మన ఠీవి పి వి అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలగడానికి కారణం- అనేక భాషల్లో అభినివేశం. ప్రావీణ్యం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో సునామీ సృష్టించి అధికారంలోకి వచ్చిన అన్న ఎన్ టీ ఆర్ రాష్ట్రంలో రాణించినంతగా జాతీయ స్థాయిలో నిలదొక్కుకోకపోవడానికి కారణం- హిందీలో పట్టు లేకపోవడం.

పన్నెండేళ్లలోపు పిల్లలు ఎన్ని భాషలయినా అలవోకగా నేర్చుకోగలరు అన్నది ఒక పరిశీలన. చిన్నప్పుడే మాతృభాషకు తోడు మరో రెండు భాషలు నేర్చుకోవడం మంచిదే.

నోరున్నవాడిదే ఊరు.
భాషలున్నవాడిదే ప్రపంచం. భాషకు లోకం దాసోహం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్