టీమిండియా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కోసం బుమ్రా జట్టుతో చేరనున్నాడు. ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది. వెన్ను నొప్పి కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి బుమ్రా ఆటకు దూరమయ్యాడు. నవంబర్ లో ముగిసిన టి20 ప్రపంచకప్ టోర్నమెంట్ సైతం అతడు ఆడలేకపోయాడు.
బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందుతోన్న బుమ్రా ఫిట్ గా ఉన్నట్లు అధికారులు ప్రకటించడంతో అతన్ని జట్టులోకి తీసుకోవాలని బిసిసిఐ నిర్ణయించింది.
మూడు టి20లు, మూడు వన్డేల సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. తొలి టి 20 నేడు ముంబై వాంఖేడే స్టేడియంలో జరగనుంది. 5,7 తేదీల్లో పూణే, రాజ్ కోట్ లలో మిగిలిన రెండు మ్యాచ్ లు జరగనున్నాయి.
ఇక వన్డేల విషయానికి వస్తే… జనవరి10, 12, 15 తేదీల్లో గువహటి, కోల్ కతా, త్రివేండ్రం లలో జరుగుతాయి.
టి 20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా, సూర్య కుమార్ యాదవ్ వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చారు.
వన్డే జట్టుకు రోహిత్ కెప్టెన్ గాను, హార్దిక్ వైస్ కెప్టెన్ గాను ఉంటారు. ఇప్పటికే 16 మందితో జట్టును ప్రకటించగా తాజాగా బుమ్రా చేరికతో ఆ సంఖ్య 17కు చేరింది.