రెండ్రోజుల తేడాతో పత్రికల్లో వచ్చిన రెండు వార్తలను కలిపి చదువుకుంటే బ్యాంకుల ఆధునిక ధర్మం, పనితీరు, గుణగణాలు తేలిగ్గా తెలిసిపోతాయి.
మొదట ఈ రెండు వార్తల సారం గ్రహించి, తరువాత ఆధునిక బ్యాంకుల ఆదర్శాల్లోకి వెళదాం.
సామాన్యుల నెత్తిన మరింత భారం:-
సామాన్యుల సేవింగ్స్ ఖాతాల్లో సేవలకు పరిమితులను పెడుతూ ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్ బి ఐ చిత్ర విచిత్రమయిన నిర్ణయాలు తీసుకుంది. నెలకు ఆ పరిమితికి మించి సేవలు కావాలంటే ఛార్జీలను వసూలు చేస్తారు. సులభంగా అర్థం కావడానికి ఇలా చెప్పుకోవచ్చు.
నెలకు నాలుగు సార్లు దాటి మీరు బ్యాంక్ పనికి వెళితే – అయిదో సారి నుండి మీ ప్రతి పనికి ఎంతో కొంత ఫీజు వసూలు చేస్తారు. మన అకౌంట్లో డబ్బే ఆ ఫీజుల్లో కోతలకు గురై చివరకు బ్యాంకులను పట్టి నిలపడానికి మనమే ఎదురు అప్పు చేసి డిపాజిట్ చేయాల్సి రావచ్చు!
చోక్సి నీటిమీద రాతలు:-
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టి, వజ్ర సంకల్పంతో లండన్ పారిపోతే- ఆ వజ్రాన్ని అక్కడి జైల్లో పెట్టడానికి మన ప్రభుత్వానికి చుక్కలు కనిపించాయి. ఆ నీరవ్ బంధువు చోక్సి మరో మేలిమి వజ్రం. ఇదే కేసులో అతను కూడా ముద్దాయి. పద్నాలుగు భువన భాండాల్లో అతను ఎక్కడున్నాడో ఈ ఆధునిక కాలంలో మనకు చేత కాలేదు.
డొమినికా దేశంలో సముద్రంలోకి డాక్యుమెంట్లు పడేస్తుంటే అక్కడి పోలీసులు అనుమానించి ఆరా తీస్తే అతను చోక్సి అని కాకతాళీయంగా తెలిసింది. బాబ్బాబు దేశానికి రా! అని ఇప్పుడు ప్రాధేయపడాలి. అంతర్జాతీయ ద్వైపాక్షిక సంబంధ బాంధవ్యాల్లో అనేక మెలికలు ఉంటాయి. ఈ రెండు వజ్రాలు మన దేశానికి వచ్చినా- జైలు గదుల్లో పెట్టి ప్రభుత్వ ఖర్చుతో మూడు పూటలా కూడు పెట్టాల్సిందే తప్ప- వడ్డీతో సహా వారు కట్టాల్సిన పదకొండు వేల కోట్ల రూపాయల్లో పదకొండు రూపాయలు కూడా వెనక్కు రాబట్టుకోలేం. ఎందుకంటే వారు వజ్రాలు- బ్యాంకులు బొగ్గులు కాబట్టి.
మన గుడ్డి బ్యాంకుల మొహానికి ఒక బలిసిన ఆసామి పెట్టుకునే లోన్ అప్లికేషన్ ఇలా ఉంటుంది!
మహారాజ రాజశ్రీ దివాలా తీయబోయే బ్యాంకు దివ్యసముఖమునకు – విలాసానగర్ వాసి దిలాసారావు రుణంకోసం పెట్టుకున్న దరఖాస్తు.
పేరు :
దిలాసారావు
అడ్రెస్ :
విలాసానగర్, హై స్పిరిట్ హిల్స్,
వయసు :
అరవై. కానీ ఇరవైలా కనపడతాను.
హెల్త్ ప్రొఫైల్ :
లేని రోగం లేదు
చదువు :
టెన్త్ టెన్ టైమ్స్
వృత్తి :
వ్యాపార రాజకీయం
ప్రవృత్తి :
రాజకీయ వ్యాపారం
కంపెనీ :
ముంచే ఇన్ఫ్రా మంచ్
అనుభవం :
పది రాష్ట్రాల్లో ఇంకెప్పటికీ పూర్తికాని వందల ప్రాజెక్టులు
పార్టీ సభ్యత్వం:
రోజూ రాత్రి పార్టీలు. ఇప్పటికి అయిదు పార్టీలు- ఏది రూలింగులో ఉంటే ఆ పార్టీ
అర్హత :
పెద్దవారితో ఫోటోలు, వీడియోలు, వియ్యాలు. చిన్నవారితో కయ్యాలు.
గ్యారెంటీ :
భారతదేశంలో ప్రతినగరంలో ఇల్లూ వాకిలి, హంగు ఆర్భాటం ఉన్నా అవన్నీ భార్యా పిల్లలపేరుతో ఉండడంవల్ల- గ్యారెంటీ ఇవ్వడానికి ఏమీ లేదు.
పిల్లలు:
చదువు మానేసి రాత్రిళ్లు ఒంటిగంటప్పుడు కార్లో మెట్రో పిల్లర్లను కొట్టుకునే కొడుకు. కంపెనీ వ్యవహారాలను చూసుకునే కూతురు. కూతురు కొంగు పట్టుకుని తిరిగే అల్లుడు.
ఉద్యోగులు :
ఆరునెలలుగా జీతాలివ్వకపోయినా మిగిలి ఉన్న వెయ్యి మంది నమ్మకానికి మారుపేరయిన పేరులేని మనుషులు.
పదివేల కోట్లు ఎందుకోసం?
కూతురు , అల్లుడు డొక్కు ప్యాసింజర్ విమానాల్లో బ్లడీ కంట్రీ మెన్ తో తిరగలేకపోతున్నారు. సొంతంగా రెండు బోయింగ్ 747 విమానాలు కొనుక్కోవాలి. అలాగే అబ్బాయికి ఒక హెలిక్యాప్టెర్, నాకు లండన్లో ఒక హోటల్, మా ఆవిడకు స్విట్జర్ల్యాండ్ లో ఒక పెద్ద ఆల్ప్స్ పర్వతం కొనడానికి. ఇంకొన్ని చెప్పుకోలేని చిల్లర ఖర్చులకు.
తిరిగి చెల్లించే పద్దతి:
ఈ ఎం ఐ లు కట్టడం నా నిఘంటువులోనే లేదు
వడ్డీ రేటు:
ఎంతయినా పరవాలేదు
భవిష్యత్ ప్రాజెక్టులు:
పది వేలకోట్లు చేతికొచ్చాక లండన్ లో కూర్చుంటేకానీ క్లారిటీ రాదు
మీరు విల్ ఫుల్ డిఫాల్టరా?
నేరం నాది కాదు. వ్యాపారానిది. నమ్మాను. పెట్టాను. పోయింది. కట్టాలనే అనుకుంటాను. కట్టలేకపోతున్నాను. అయినా వెంటపడి బ్యాంకులు నన్ను లోన్లు తీసుకోమని ప్రాధేయపడుతుంటే కాదనలేక తీసుకుంటున్నాను.
మీ జీవితాశయం:
భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం. దేశంలో పేదలను పూర్తిగా నిర్మూలించడం. నాకు గంజి తెలుసు- కానీ తాగను. నాకు బెంజీ తెలుసు- కానీ వాడకుండా ఉండలేను.
మీకు వచ్చిన అవార్డులు :
దేశంలో అత్యధిక లోన్లు తీసుకున్న వ్యక్తిగా వరుసగా ఇరవై ఏడో సారి అవార్డు మొన్ననే కేంద్ర ఆర్థిక మంత్రి చేతుల మీదుగా తీసుకున్నాను. ఫోటో ఈజ్ ఎన్ క్లోస్డ్.
మీ విదేశీ టూర్లు:
అన్ని అంతర్జాతీయ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీల్లో పాఠాలు చెప్పాను. హార్వర్డ్ లో నా మీద ఒక పాఠమే పెట్టబోతున్నారు.
మీ హాబీలు :
పొద్దున పూజలు,
మధ్యాహ్నం డబ్బులు,
సాయంత్రం గోల్ఫ్ లు ,
రాత్రిళ్లు పబ్బులు
మీ ఛారిటీ :
మా ఊళ్లో వందకోట్లతో గుడికడుతున్నాను. ఊరిజనం నాకే గుడి కడతామన్నారు. నేనే సున్నితంగా తిరస్కరించాను.
మీరు చేయలేకపోయిన పనులు:
ఏమీ లేవు. అన్నీ చేసేశాను.
మీ మీద పెండింగ్ కేసులు:
చట్టం తనపని తాను చేసుకుపోతుంది. మా లాయర్లు వారిపని వారు చేసుకుని పోతుంటారు.
మీ ఫిలాసఫీ:
డబ్బు బ్యాంకులకు కాస్తుంది.
బ్యాంకులు ఎగ్గొట్టేవారిని కాస్తాయి. ఎగ్గొట్టేవారిని లోకం కళ్లు కుళ్లుతో చూస్తాయి.
మీ నినాదం:
రుణానుబంధ రూపేణా పైసా గీసా రావాలయా!
మీరు రాస్తున్న పుస్తకం:
సారీ. నేను రాయట్లేదు. నేను జుట్టుకు రంగు మాత్రమే రాసుకుంటాను. నా మీద అభిమానంతో ఉద్యోగం పోయిన ఒక బ్యాంకు మేనేజర్ పుస్తకం రాశాడు.
పదేళ్లుగా అది బెస్ట్ సెల్లర్ బుక్.
టైటిల్ – “దిలాసారావు రుణవిలాసం”
మీకింత జ్ఞానం ఎలా వచ్చింది?
ఆ పాపం నాది కాదు- అది జన్యులోపం
లోన్ ఎప్పటిలోపు కావాలి?
పదివేల కోట్లు ఒకే విడతలో వచ్చే వారం ఇదే సమయానికి కావాలి. సంతకాలకు నేను బ్యాంకులకు రాను. బ్యాంకులే మా గేటుదగ్గరికి రావాలి.
మీ ఫోన్ నంబర్ :
420 420 840 840
మీ మెయిల్ ఐ డి :
[email protected]
(బ్యాంకు బోర్డు బొంబాయి అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న అరవయ్యో అంతస్తు గాజు మహల్లో అసాధారణ ప్రత్యేక అత్యవసర విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి, దిలాసారావు అభ్యర్థనను కళ్ళకద్దుకుని అంగీకరించిందని తెలియజేయజేస్తూ సంతోషించకుండా ఉండలేకపోతున్నాం)
-పమిడికాల్వ మధుసూదన్