ఉత్తర ఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య ప్రదేశ్ లోని పన్నా జిల్లా నుంచి చార్ ధామ్ యాత్రకు యాత్రికులను తీసుకెళ్తున్న బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలో పడిపోయింది. యమునోత్రి వెళుతుండగా ఉత్తర కాశి లోని దామ్తా వద్ద బస్సు 200 అడుగుల లోతున ఉన్న లోయలో పడింది. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, ఒక హెల్పర్, 28 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో 26 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం. ఇప్పటి వరకు అధికారులు 17 మృతదేహలను బయటకు తీశారు.
గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. చనిపోయిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు, గాయపడ్డ వారికి రూ. 50 వేల చొప్పన ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు. ఉత్తర ఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ప్రమాదంపై మధ్యప్రదేశ్ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున, గాయపడ్డ వారికి 50 వేల చొప్పున మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరపున పరిహారం ప్రకటించారు.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం