Sunday, November 24, 2024
HomeTrending Newsకంటోన్మెంట్ లో ఓటర్ల తొలగింపు అక్రమం - కేటీఆర్

కంటోన్మెంట్ లో ఓటర్ల తొలగింపు అక్రమం – కేటీఆర్

కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35వేల ఓటర్ల పేర్లను తిరిగి జాబితాలో చేర్చాలని ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న 35వేల మంది పౌరుల పేర్లను ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా తొలగించారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉన్న భూమిలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో, అర్హత కలిగిన వారిని కూడా ఓట్ల జాబితా నుంచి తొలగించారని తెలిపారు.

భారత స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాల హక్కులకు భంగం కలిగించేలా, అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓట్ల తొలగింపు కార్యక్రమం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. తొలగించిన ఓటర్లకు కానీ, వారి కుటుంబాలకు కానీ ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారన్నారు. భారతదేశ పౌరులుగా తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసముంటున్న వీరి ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా, వారికి రాజ్యాంగం కలిగించిన ఓటు హక్కును దూరం చేయడం ఆక్రమం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కంటోన్మెంట్ బోర్డ్ కు, విద్యుత్ శాఖకు, వాటర్ సప్లై డిపార్ట్మెంట్లకు బాధ్యత కలిగిన పౌరులుగా దశాబ్దాలుగా వీరు పన్నులు, బిల్లులను చెల్లిస్తున్నారన్నారు. వీరు గతంలోనూ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లోను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కంటోన్మెంట్ బోర్డు వీరి హక్కులను హరించేలా ఏకపక్షంగా ఓటర్ల జాబితా నుంచి తొలగించిందన్నారు.

అక్రమంగా నివాసం ఉంటున్నారని కంటోన్మెంట్ బోర్డు చెప్పిన కారణం సాహేతుకంగా లేదని కేటీఆర్ అన్నారు. ఇప్పటిదాకా దేశంలోని ఏ న్యాయస్థానం కానీ, స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కానీ వీరు ఆక్రమంగా నివసిస్తున్నారని అధికారికంగా తేల్చలేదన్నారు. తొలగించిన ఓటర్లను అక్రమంగా నివాసం ఉంటున్నారని రుజువు చేయకుండానే, నేరుగా వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం అన్యాయం అని కేటీఆర్ ప్రశ్నించారు.  2018 లో 1,91,849 ఓటర్లు ఉంటే ఈరోజు వారి సంఖ్య 1,32,722 కు తగ్గడం దురదృష్టకరమన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ చేపడుతున్న ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యల వలన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గత ఐదు సంవత్సరాలుగా ఓటర్ల జాబితాలోని పౌరుల సంఖ్య పెరగకుండా తగ్గిందన్నారు.

ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ పరిధిలో నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 35 వేలమంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని, వారిని తిరిగి ఓటర్ల జాబితాలోకి చేర్చాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Also Read : ఉపాధి హామీకి కేంద్రం తూట్లు – మంత్రి ఎర్రబెల్లి

RELATED ARTICLES

Most Popular

న్యూస్