Sunday, April 14, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసినిమా సంతానం

సినిమా సంతానం

Celebrity Divorce Confession – Divorced, will be remain as friends and co-parents

ఇదొక పేరు గొప్ప దంపతుల విడాకుల సంయుక్త ప్రకటన. గొప్పవారు కావడం వల్ల పేర్లు ప్రకటించడం సభా మర్యాద కాదు.

అభిమానులారా!
నిండు మనసులతో మేమిద్దరం మీ ముందు ఈ విషయం చెబుతున్నాం. రేపు సూర్యోదయం నుండి మేము దంపతులం కాకపోయినా మా బిడ్డకు మాత్రం బాధ్యతగల తల్లిదండ్రులం. మేము ప్రారంభించబోయే కొత్త జీవితానికి మీరు “విడాకులు” అని పేరు పెట్టుకుంటే మాకేమీ అభ్యంతరం ఉండబోదు. నేను నా మొదటి భార్యకు విడాకులిచ్చినా- మొదటి భార్య పిల్లలకు తండ్రినే. ఇప్పుడు రెండో భార్యకు కొత్త జీవితాన్ని ఇచ్చినా- ఆమె సంతానానికి తండ్రినే. మూడో భార్య ముచ్చట ఇప్పుడు అనవసరం.

నేను నా మొదటి భర్తకు విడాకులు ఇచ్చినా- మొదటి వైవాహిక సంతానం ఇప్పటికీ నా ద్వితీయ గృహంలోనే ఉంది. రేపు నా తృతీయ గృహ ప్రవేశానికి నా ప్రథమ, ద్వితీయ వైవాహిక సంతానమే పౌరోహిత్యం చేయబోవడం నాకు పులకింతగా ఉంది.

నా మొదటి భార్యలాగే, నా రెండో భార్య కూడా చాలా నెమ్మదస్తురాలు. మంచిది. ఇండిపెండెంట్ భావాలున్నాయి. అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న నా చతుర్థ గృహంలో పాలు పొంగించడానికి నా ప్రథమ, ద్వితీయ మాజీ భార్యలు పట్టు చీరలు కట్టుకుని వస్తామంటే- నా చతుర్థ అర్ధాంగి ఎగిరి గంతేస్తోంది. నీ పిల్లలు, నా పిల్లలు కలిసి మన పిల్లలతో కలిసిమెలిసి ఉండడం కంటే కావాల్సింది ఏముంది?

Celebrity Divorce Confession

ఈ పదిహేనేళ్ల వైవాహిక బంధంలో మేము ఎన్నెన్ని ఆనందాలు అనుభవించామో నెట్ ఫ్లిక్స్ లో వెబ్ సీరీస్ గా మా సంయుక్త నిర్మాణంలో దృశ్య రూపంలో రానుందని ఇదే సందర్భంగా మీతో పంచుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా సంతానం పెళ్లి, మేము విడి విడిగా మళ్లీ చేసుకునే పెళ్లిళ్లు అమెజాన్ ప్రైమ్ లో ఒరిజినల్ సీరీస్ గా మా విడి విడి ప్రొడక్షన్ ల నుండి వస్తాయి.

మొన్ననే మేము నటించిన సంసారం సినిమాకు జాతీయ ఉత్తమ సినిమా అవార్డు వచ్చింది. అంటే మా సంసారం ఉత్తమమయినది అని మీరు పొరపాటు పడకండి. సినిమా సంసారానికి అవార్డు వచ్చింది. నిజమయిన సంసారం నెర్రెలు చీలింది. జాతీయ ఉత్తమ హీరోగా ఏడుసార్లు నాకు అవార్డు ఇచ్చారు. సినిమాల్లోనే నేను హీరో- బయట జీరో అని నా మాజీ సతీమణి ఎక్కడో అన్న విషయం ఇక్కడ అనవసరం.

ధర్మంలో సహచరి కాబట్టి సహ ధర్మచారిణి అని అంటున్నారని మొన్న చివరి రౌండు చివరి చుక్క వేసుకుంటూ మా సంసారం సినిమా స్క్రిప్ట్ రైటర్ ఏదో గొప్ప అర్థం చెప్పినట్లు లీలగా గుర్తు. సహధర్మచారిణి ఒకే మాట కాదని, సహ, ధర్మ, చారిణి వేరు వేరు మాటలని నా విడుదల కాని సినిమాకు మాటలు రాసిన మరో రైటర్ ఇంకో అర్థం చెప్పినట్లు గుర్తు. నాకెందుకో ఈ విడి విడి విభజన అర్థంలో ఎంతో అంతరార్థం దాగి ఉన్నట్లు అనిపిస్తోంది. మొదట సహతో ఉన్నాను. తరువాత ధర్మతో ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతానికి చారిణితో తిరగక తప్పని పరిస్థితి ఏర్పడింది.

ఇదంతా నిజానికి మీకు చెప్పాల్సిన పనిలేదు. కానీ మా విశ్వ సంసారంలో మాజీలు, రాజీలు, జాజీలు కలిసినప్పుడు ఎవరు ఎవరికి ఏమవుతారో మీకు ఒక క్లారిటీ ఉండాలని ఈ లేఖ రాస్తున్నాం.

అయినా మీకు ఇదంతా గజిబిజి బంధాల్లా అనిపించి, చిక్కుముడిగా అనిపిస్తే-
ఒక పేపర్ పెన్ను తీసుకుని…
1 . ఏ కు జరిగిన మొత్తం పెళ్లిళ్లు
2. ఏ కు కలిగిన మొత్తం సంతానం
3 . ఏ కు బి తో విడాకులు
4 . బి కి సి తో సహచర్యం
5 . ఏ విడాకుల భరణం
6. డి ప్రమేయం
7. ఏ సీ ఏసీ రూముల్లో మళ్లీ దగ్గర కావడం
8. ఏ మీద ఈ కోర్టు కేసు
9. ఏ నుండి జెడ్ దాకా ఉన్న సంతానానికి తండ్రి ఎవరు? తల్లి ఎవరు? పోషణ ఎవరిది?
10. ఏ టు జడ్ తల్లిదండ్రులు కన్న సంతానం- వారి కొత్త జీవితాల తరువాత చట్ట ప్రకారం తల్లిదండ్రులే అయినా ధర్మప్రకారం అవుతారా?

ఇలా అన్ని ప్రశ్నలు రాసుకుని…సమాధానాలకోసం అన్వేషణ మొదలుపెడితే కలియుగాంతం లోపు మీ జిజ్ఞాసకు తగిన జ్ఞానం తప్పకుండా దొరుకుతుంది.

-పమిడికాల్వ మధుసూదన్

Read More: లవ్ స్టొరీ 2021

RELATED ARTICLES

Most Popular

న్యూస్