Saturday, March 14, 2026
HomeTrending Newsఏడున్నరేళ్లుగా కేంద్రం సహకారం లేదు - మంత్రి కేటీఆర్

ఏడున్నరేళ్లుగా కేంద్రం సహకారం లేదు – మంత్రి కేటీఆర్

Center Does Not Cooperate With Telangana Minister Ktr :

దేశంలో నాలుగో అతిపెద్ద ఎకానమీ కంట్రిబ్యూటర్‌గా తెలంగాణ అభివృద్ధి పథాన దూసుకుపోతున్నా కేంద్రం నుంచి సహకారం కరవైందని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. ఏడున్నరేళ్లుగా రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని ఆరోపించారు. బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న దృష్ట్యా హామీలు నిలబెట్టుకోవాలని ప్రధాని, ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని,తెలుగు రాష్ట్రాలకు స్పెషల్ ఇండస్ట్రీయల్ రాయితీలు అందించాలని కోరారు. ప్రధాని మోదీ పదేపదే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నారని, రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోతే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఈ రోజు డ్రిల్‌మెక్‌ స్పా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకున్న కార్యక్రమంలోమంత్రి కేటిఅర్ పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థలు తరలిరావడం….. సీఎం కేసీఆర్‌ అద్భుత పాలనకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థకు చెందిన తయారీ యూనిట్‌ ప్రారంభం కాబోతోంది. ఆయిల్‌ డ్రిల్లింగ్‌, రిగ్‌ సెక్టార్‌లో ప్రపంచ స్థాయి కంపెనీగా వెలుగొందుతున్న డ్రిల్‌ మెక్‌స్పా రాష్ట్రంలో రూ.15వందల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో రిగ్గుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఈ పరిశ్రమ ద్వారా 2,500 మందికి ఉపాధి దక్కుతుందన్న కేటీఆర్‌ 80శాతం వరకు స్థానికులకే కొలువులు దక్కేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

ప్రపంచ దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలను కాదని హైదరాబాద్‌లో డ్రిల్‌మెక్‌ స్పా సంస్థ తమ యూనిట్‌ ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. డ్రిల్‌ మెక్‌స్పా ఆయిల్‌ రిగ్గులను తయారు చేసే సంస్థ. తెలంగాణలో సముద్రం తీరం లేదు, ఆయిల్‌ రిజర్వ్‌లు లేవు. డ్రిల్‌ మెక్‌స్పాకు రాష్ట్రంలో ప్రత్యక్ష వినియోగదారులు కూడా లేరు. అయినా ఇటలీ, యూఎస్‌ వంటి దేశాలను కాదని భారత్‌లో పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకోవడం, దేశంలోని ఎన్నో రాష్ట్రాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందినా హైదరాబాద్‌నే ఎంచుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అద్భుత పాలనకు నిదర్శనం అన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరమని, హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు.తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారు. కానీ ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. కేవలం నినాదంతో మేకిన్‌ ఇండియా సాకారం కాదు. అందుకు తగిన సంస్కరణలు, విధానాలు, మౌలికవసతులు తీసుకురావాలి. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌గా దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌కు శ్రీకారం చుట్టాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌, హైదరాబాద్‌ ఫార్మాసిటీ ఏర్పాటుచేయబోతున్నాం. కేంద్రం నుంచి వీటికి సాయం కోరినా స్పందన లేదు. 6 కొత్త ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఏర్పాటుచేయాలని కోరాం. అది కూడా కార్యరూపం దాల్చలేదు. సైద్దాంతిక, రాజకీయ విభేదాల కారణంగా రాష్ట్రంపై వివక్ష చూపితే సంక్షోభం తలెత్తుంది. దేశంలో పారిశ్రామికీకరణకు, ఉద్యోగ కల్పనకు, ఆత్మనిర్భర్‌ భారత్‌ సంకల్పానికి విఘాతం కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular