Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుడిమల్ల భరత్ భూషణ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తెలంగాణ ప్రజల జీవన శైలిని, సంస్కృతిని, చారిత్రక ఘట్టాలను తన ఆర్ట్ ద్వారా, ఛాయా చిత్రాల ద్వారా ప్రపంచానికి చాటిన భరత్ భూషణ్ దశాబ్దాల కృషి గొప్పదని సీఎం అన్నారు. భరత్ భూషణ్ మరణం తో తెలంగాణ వొక అరుదైన చిత్రకారుడు, ఫోటో జర్నలిస్ట్ ను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భరత్ భూషణ్ మరణం పట్ల టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మంట్రులు  కే తారకరామారావు, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. భరత్ భూషణ్ అద్భుతమైన చిత్రకారుడని… తెలంగాణ ప్రజల సంస్కృతిని చారిత్రక ఘట్టాలను ప్రపంచానికి చూపించిన గొప్ప కళాకారుడన్నారు.

దాదాపు పాతిక సంవత్సరాల తర్వాత క్యాన్సర్ మళ్ళీ తిరగబెట్టడంతో గత కొంత కాలంగా భరత్ భూషణ్ హైదరాబాద్ బసవ తారకం ఆస్పత్రిలో రేడియేషన్, కీమో చికిత్సలు తీసుకున్నారు. తాజాగా తిరగబెట్టిన క్యాన్సర్ కి తోడు వారికి మల్టిపుల్ సమస్యలున్నాయి. షుగర్, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లెమ్స్ కూడా ఉన్నాయి. ఒకటిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. ఫోటోగ్రఫీ ద్వారా  తెలంగాణ సాంస్కృతిక రాయబారిగా ఎదిగిన  భరత్ భూషణ్  వరంగల్ జిల్లాకు చెందినవారు. వరంగల్లులో గుడిమల్ల అనుసూయ, లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించిన భరత్ భూషణ్ (66)ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చిన్ననాటినుంచే అటువైపు మళ్లారు. తనకు ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా ఆయన భయపడేవారు కాదు. ‘మృత్యువుకి కళ అంటే బీతి అని, అందుకే అది తననింకా కబలించివేయలేదని’ ఆయన ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతుండేవారు.  “ఇప్పటికిప్పుడు నేను చనిపోయినా నా శరీరం అంటుకోదు. కాలిపోదు. కళా ప్రస్థానంలో నేను చేయవలసిన పనులు మిగిలే ఉన్నాయి. అవి తీరేదాకా నాకు మరణం లేదు” అన్నారాయన ఇటీవలే మాట్లాడుతూ అంతలోనే విషాదం చోటు చేసుకుంది.

తెలంగాణ బతుకు చిత్రాలను తన ఫోటోగ్రఫీ ద్వారా చిత్రీకరించిన  భరత్ భూషణ్ ఇప్పటివరకు 7 వ్యక్తిగత ప్రదర్శనలు చేశారు.  బతుకమ్మ, తెలంగాణలోని పల్లె  దర్వాజాలు ఆయన ఫోటోలలో ఎక్కువగా కనిపిస్తాయి. కరువు కాటకాలు, వలసలు, సమస్త విధాలా జీవన విధ్వంసం, వీటి తాలూకు పర్యవసానాలను అయన చిత్రాలు చెబుతాయి. అదే సమయంలో బతుకు పట్ల విశ్వాసాన్ని, జీవన వైవిద్యాన్ని, అందలి ఈస్తటిక్స్ తో సహా అవి ఆవిష్కరిస్తాయి.

అయన ఫొటోలలో ఇండ్లు, కూలిన గోడలు, దర్వాజాలు, గొల్లం పెట్టినవే కాదు, తాళం వేసిన ఇండ్లు, దీపం లేని దిగూడులు, వాకిట్లో ముగ్గులు, వంటింట్లో వస్తు సామాగ్రి కనిపిస్తాయి. మొత్తంగా తెలంగాణ పల్లె జీవితం చక్కగా ఆవిష్కృతమవుతుంది ఆయన చిత్రాల్లో.  దైనందిన జీవితాన్నే కాదు, పండుగలను పబ్బాలనూ చిత్రీకరించారు. ముఖ్యంగా నిలువెత్తు తెలంగాణ జీవన వ్యాకరణాన్ని అయన గోడల మీది రాతలతో సహా సంక్షిప్తం చేశారు.

సాంస్కృతిక రంగంలోనే కాదు, సాంఘీకంగా రాజకీయంగా కూడా తెలుగు ప్రజల జీవితాల్లో విడదీయరాని ముద్ర వేసిన ఎంతోమంది మూర్తిమత్వాన్ని భరత్ భూషణ్ ఎంతో హుందాగా చిత్రించారు. కవి శివ సాగర్, నల్ల కలువ టీ.ఎన్.సదాలక్ష్మి, జానపద పితామహులు బిరుదురాజు రామరాజు వంటి వారిని అయన ఎంతో బాధ్యతగా ఫొటోలు తీసి పెట్టారు. ముఖ్యంగా తెలంగాణ కవి కాళోజి ఛాయాచిత్రాలు తీసింది భరత్ భూషణ్ గారే.

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com