Monday, May 20, 2024
Homeస్పోర్ట్స్వెస్టిండీస్ దే టి20 సిరీస్

వెస్టిండీస్ దే టి20 సిరీస్

West Indies won the Series: ఇంగ్లాండ్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు టి20ల సిరీస్ ను విండీస్ 3-2 తేడాతో గెల్చుకుంది. నేడు జరిగిన చివరి, నిర్ణాయక మ్యాచ్ లో 17  పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది. కరేబియన్ బౌలర్లు జసేన్ హోల్డర్ ఐదు, అకీల్ హోసేన్ నాలుగు వికెట్లతో రాణించి ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశారు. ఇటీవలే స్వదేశంలో ఐర్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను కోల్పోయిన విండీస్ ఈ సిరీస్ లో సమిష్టిగా రాణించి సత్తా చాటింది.

స్వదేశంలో జరిగిన ఈ ఐదు టి 20 మ్యాచ్ లూ బార్బడోస్ , బ్రిడ్జిటౌన్ లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగాయి. నేటి మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్-34; మేయర్స్-31 పరుగులతో రాణించారు. చివర్లో కెప్టెన్ పోలార్డ్-41 (25బంతులు, 1 ఫోర్, 2సిక్సర్లు )తో పాటు పావెల్ ధాటిగా ఆడి 17  బంతుల్లో ఒక ఫోర్, నాలుగు భారీ సిక్సర్లతో 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. నిర్ణీత 20  నాలుగు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ లో ఆదిల్ రషీద్, లివింగ్ స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇంగ్లాండ్ 8 పరుగులకే ఓపెనర్ జేసర్ రాయ్(8) వికెట్ కోల్పోయింది, 40 పరుగుల వద్ద మరో ఓపెనర్ టామ్ బ్యాంటన్ (16) కూడా వెనుదిరిగాడు. జేమ్స్ వీన్స్-55;  శామ్ బిల్లింగ్స్-41 పరుగులతో రాణించారు. 19.5 ఓవర్లలో 162  పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యింది. అకీల్ నాలుగు ఓవర్లలో 30 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీయగా, హోల్డర్ కేవలం 2.5 ఓవర్లలో 27 పరుగులిచ్చి ఐదు వికెట్లతో రాణించి విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ తో పాటు, ‘ప్లేయర్ అఫ్ ద  సిరీస్’ కూడా సాధించాడు.

మార్చి నెలలో ఇంగ్లాండ్- వెస్టిండీస్ మధ్య మూడు టెస్టుల సిరీస్ జరగనుంది. ఈలోపు ఫిబ్రవరిలో విండీస్ జట్టు ఇండియాలో పర్యటించి మూడు వన్డేలు, మూడు టి 20 మ్యాచ్ లు ఆడనుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్