Sunday, January 19, 2025
HomeTrending Newsధాన్యం కొనుగోలుపై తేల్చని కేంద్రం

ధాన్యం కొనుగోలుపై తేల్చని కేంద్రం

Center on Paddy :

రాష్ట్రంలో ఇప్పటికే సాగయిన వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేయాలని, రానున్నయాసంగి వరిధాన్యం కొనుగోలు విషయం పై ముందుగానే స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ట్ర రైతాంగం ఎదుర్కుంటున్న ఇబ్బందులు తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై పరిశ్రమలు ఐటి శాఖ మంత్రి కేటిఆర్ ఆధర్యంలోని రాష్ట్ర మంత్రులు, ఏంపీలు, ఉన్నతాధికారుల బృందం మంగళవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ తో న్యూఢిల్లీలో మంత్రి కెటిఆర్ బృందం విడివిడిగా సమావేశమై ఈ మేరకు చర్చలు జరిపింది.
కెటిఆర్ బృందంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( ముగ్గురు మంత్రులు) తో పాటు రాజ్యసభలో టిఆర్ఎస్ పార్టీ పక్షనేత ఎంపీ కె.కేశవరావు, లోక్ సభలో టిఆర్ఎస్ పక్షనేత ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎంపీలు.. సురేశ్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, కొత్తా ప్రభాకర్ రెడ్డి లు ( పదిమంది ఎంపీలు) వారితో పాటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్ రావు లతో కూడిన ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధులు అధికారుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా, తెలంగాణ రైతు ఈ వానాకాలం లో పండించిన వరిధాన్యం కొనుగోలు అంశం పై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టతనివ్వలేదు.. కాగా, వచ్చే యాసంగి బాయిల్డ్ రైస్ ను కొనబోమని మరోసారి ఖరాఖండిగా తేల్చి చెప్పింది. మామూలు బియ్యాన్ని ఎంతకొంటామనే విషయాన్ని ఈనెల 26 వతేదీన స్పష్టం చేస్తామని కేంద్రం మంత్రులు తెలిపారు.

రాష్ట్ర ఉన్నతాధికారుల బృందంతో ఈనెల 26వ తేదీన మరోసారి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ మరోసారి సమావేశం కానున్నారు.
కాగా…ప్రతి ఏటా ఎంత ధాన్యం కొంటామనే విషయంలో వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్ ను ముందస్తుగానే ప్రకటించాలనే ముఖ్యమంత్రి కెసిఆర్ డిమాండ్ కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింపచేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభిప్రాయ పడింది. మంత్రి వర్గ బృందంతో చర్చల సందర్భంగా ఈ మేరకు సిఎం కెసిఆర్ సూచనను కేంద్రం అభినందించింది. ఇకనుంచి వార్షిక వరిధాన్యం కొనుగోలు వివరాలను ముందస్తుగానే ప్రకటిస్తామని, రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్ఠం చేసింది.వొక్క తెలంగాణకే కాకుండా ఈ నూతన విధానాన్ని అన్ని రాష్ట్రాలకూ వర్తింపచేస్తామన్నది.
కాగా,. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే వరకు రాష్ట్ర రైతాంగం తొందర పడి యాసంగి వరి విషయంలో వేచి చూడాలని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది .

Also Read : ప్రధానమంత్రికి కెసిఆర్ లేఖ

RELATED ARTICLES

Most Popular

న్యూస్