Friday, February 21, 2025
HomeTrending Newsజిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ: రేవంత్ రెడ్డి

జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ: రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామని,  ఆక్రమణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేనని… ఈ విషయంలో  ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు.

చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని… చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవని,  నాలాల ఆక్రమణలను ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. కబ్జాలు చేసేవారు ఎంతటివారైనా వదిలేదిలేదని, ఖమ్మంలో పువ్వాడ ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించామని తెలిపారు.  చెరువులు, కుంటల ఆక్రమణల జాబితాలు సిద్ధం చేయాలని,  కోర్టుల అనుమతి తీసుకుని ఆక్రమణలు తొలగిస్తామని వివరించారు. ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం సిఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు.

వరదల్లో మృతుల కుటుంబాలకు 5లక్షల రూపాయల పరిహారం అందిస్తామన్నారు.  బాధిత కుటుంబాలను పరామర్శించి వారి కష్టనష్టాలను తెలుసుకున్నామని, మరిపెడ మండలంలో మూడు తండాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ఒక కాలనీలా ఏర్పాటు చేసి తండా వాసులను అక్కడికి తరలిస్తామన్నారు.

ఈ వరదలను కేంద్రం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలని రేవంత్ డిమాండ్ చేశారు. విష జ్వరాలు ప్రబలి అంటురోగాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మెడికల్‌ బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బురద కడగడానికి వీలైనన్ని నీళ్ల ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని,  ప్రభుత్వ యంత్రాంగమంతా సమన్వయం చేసుకోవాలని… అవసరమైతే ఇతర జిల్లాల పోలీసులు, అధికారుల సాయం తీసుకోవాలని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్