Saturday, April 20, 2024
HomeTrending Newsబిజెపికి మరోసారి తిరస్కరణ-కేటీఆర్

బిజెపికి మరోసారి తిరస్కరణ-కేటీఆర్

భారతీయ జనతా పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా సెస్ ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు అన్నారు. సెస్ ఎన్నికలలో అడ్డదారిన గెలిచేందుకు భారతీయ జనతా పార్టీ సాధారణ ఎన్నికల మాదిరి అన్ని ప్రయత్నలని చేసిందని, అయితే బిజెపి కుటిల ప్రయత్నాలను ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించి, తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పారని కేటీఆర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని సంపూర్ణంగా ప్రవేటికరించి, కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే కుట్రలకు ఇది ఒక గుణపాఠంగా మారుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. బిజెపి విద్యుత్ సంస్కరణల పేరిట చేస్తున్న కుట్రలపై సాధారణ ప్రజలకు సైతం సంపూర్ణ అవగాహన ఉన్నదని, అందుకే సెస్ ఎన్నికల్లో ఆ పార్టీని తిరస్కరించినట్లు కేటీఆర్ అన్నారు.

విద్యుత్ పంపిణీ సంస్థ సెస్ కు ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయని, ఉచిత విద్యుత్తు రద్దు అవుతుందని, సబ్సిడీ విద్యుత్తు సౌకర్యం ఉండదని ప్రజలు భావించారని, అందుకే బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించారని కేటీఆర్ అన్నారు. బిజెపి సెస్ ఎన్నికల్లో గెలిచేందుకు భారీ ఎత్తున డబ్బులు జల్లిందని, సాధారణ ఎన్నికల మాదిరి విచ్చలవిడిగా అన్ని రకాల అడ్డదారులు తొక్కిందని, అనేక ప్రలోభాలకు తెరలేపినా, ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వెంటే నిలిచి సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. సెస్ ఎన్నికల బిజెపి ఓటమి, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం బిజెపి పట్ల నెలకొని ఉన్న తీవ్రమైన వ్యతిరేకతకు, తిరస్కారభావానికి నిదర్శనమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి స్థానం లేదని, ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక ఎన్నికల్లో బిజెపిని తిరస్కరిస్తూ వస్తున్నారని కేటీఆర్ అన్నారు.

సెస్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టిన రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు కే తారక రామారావు ధన్యవాదాలు తెలిపారు.  ఈ గెలుపుతో ఉప్పొంగిపోకుండా సెస్ పరిధిలో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా మరియు మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలు పైన దృష్టి పెడతామని కేటీఆర్ తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్