-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచద్దన్నమే మహాభాగ్యం!

చద్దన్నమే మహాభాగ్యం!

దేశము మారెనూ
వేషము మార్చెనూ …
ఆ విధంగా కన్నఊరు వదలగానే ఎన్నో మార్పులు..
అన్నిటికన్నా ముఖ్యమైంది ఆహారమార్పులు. అన్నేళ్ళుగా తిన్న చద్దన్నం వెగటవుతుంది. నాజూకు బ్రెడ్డు,గుడ్డవుతుంది.
నగరాలకు రాగానే కొన్ని అలవాట్లు అబ్బుతాయి. వాటిలో బ్రేక్ఫాస్ట్ మొదటిది. పల్లెలో ఉన్నంతకాలం పొద్దున్నే చద్దన్నం తిన్నవాళ్ళు కూడా సిటీ ముఖం చూడగానే బ్రేక్ఫాస్ట్ అంటూ ఉంటారు. ఒకప్పుడు అప్పుడప్పుడు చేసుకునే ఇడ్లి, దోసె,గారె ..ఇవన్నీ టిఫినీలుగా మారిపోయాయి. అదేంటో అమ్మమ్మ ఇంట్లో అద్భుతంగా ఉండే చద్దన్నం పట్నం వచ్చేసరికి పాచి అన్నం అవుతుంది.

నా చిన్నతనంలో ఏటా రెండుసార్లు మా అమ్మమ్మగారి ఊరు వెళ్ళేవాళ్ళం. ఒకటి సంక్రాంతి, రెండు వేసవికాలం. అక్కడ రోజూ పిల్లలందర్నీ వరసగా కూర్చోబెట్టి అరటిఆకుల్లో తరవాణి చద్దన్నం, ఆవకాయ వడ్డించేవారు. ఆపై ఆటలకి వెళ్తే మధ్యాహ్నం దాకా ఆకలి వేసేది కాదు. ఆ రోజులు ఇప్పుడెక్కడా?పప్పు ,కూరతో అన్నం తినాలంటేనే పిల్లలు ఏడుస్తున్నారు. బర్గర్,పిజ్జా,బట్టర్నాన్ …ఇలా తమవికానివి ఏవైనా పర్లేదు. ఇంటి వంట కాకపోతే చాలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల పుణ్యమా అని వేళాపాళా లేని ఉద్యోగాలు, వేళ తప్పిన తిండి అయి కూర్చుంది. మనకి తెలుసు పొద్దున్నే మజ్జిగన్నం ఎంత మేలు చేస్తుందో! అయినా శంఖంలో పోస్తేనే తీర్థమన్నట్టు ఎవరన్నా పరిశోధించి పేపర్లో వేస్తేనే నమ్ముతాం. అంతర్జాతీయ పత్రికల్లో వస్తే వేదం.
ఈ వాదనలు ఎలా ఉన్నా ఈ మధ్య చద్దన్నం స్టార్ హోటళ్ల మెనూ కెక్కింది. అందులో ఉండే పోషక విలువలూ పక్కనే ఇస్తున్నారు. దాంతో అమాంతం చద్దన్నానికి డిమాండ్ పెరిగిపోయింది. రాత్రి మిగిలిన అన్నంలో కాసిన్ని నీళ్లు, పాలు, ఉల్లిపాయముక్కలు, ఉప్పు వేసి మజ్జిగ తోడెట్టి పొద్దున్నే లాగించేస్తున్నారు. మంచి ప్రో బయోటిక్ మరి. ల్యూక్ కోటిన్హా, రుజుతా దివెకర్ వంటి ఆరోగ్య ఆహార నిపుణులూ ఎప్పటినుంచో ఇదే మొత్తుకుంటున్నారు.
చద్దన్నంలో ఉండే పోషకాలు చూద్దాం.
-ఐరన్ కావలసినంత
⁃ విటమిన్ బి 12, బి 6
⁃ పొటాషియం
⁃ పేగుల్లో చురుకుదనం
⁃ చర్మానికి నిగారింపు
⁃ బీపీ అదుపు
⁃ ఫ్రెండ్లీ బాక్టీరియా పెరుగుదల
⁃ ఇమ్మ్యూనిటీ
⁃ ముఖ్యంగా వైరస్ ల నుంచి రక్షణ

ప్రస్తుత కరోనా కాలంలో ఏ మందులు, విటమిన్లు ఇవ్వలేని, రక్షణకు తిరుగులేని అస్త్రం చద్దన్నం . ఒకప్పుడనేవారు పెద్దలమాట – చద్ది మూట అని. మాకు అక్కర్లేదని పెద్దలని, చద్దన్నాన్ని వదిలించుకున్నాం. ఇప్పుడేమో మూలాలు వెతుక్కుంటూ చద్దన్నం కావాలంటున్నాం. మంచిదే, ఈ లెక్కన పెద్దల మాటకూ మంచిరోజులే!

-కె. శోభశ్రీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్