Monday, January 27, 2025

మన భాష- 2

డాక్టర్ డి. చంద్రశేఖరరెడ్డి ఈనాటి కాలంలో చెప్పుకోదగిన భాషాశాస్త్రవేత్త. తెలుగు భాషపై సాధికారికంగా చెప్పగల, రాయగల సత్తావున్న కొద్దిమంది ప్రముఖుల్లో ఈయన ఒకరు. ఆ సాధికారికత, సత్తా ఒకనాటితో వచ్చినవికావు. నిరంతర పరిశ్రమ, స్వాధ్యాయం, అధ్యాపనం, చర్చలతో ఒనగూడినవి. అలాంటి చంద్రశేఖరరెడ్డిగారిని ‘వార్త’ దినపత్రికవారు ‘మనభాష’ను గూర్చి తెలుగు లోకానికి చెప్పమని కోరటం, వారు వారం వారం మనభాషను మనం-మనకంతా తెలుసు, మనకు తెలియందేం లేదు అనుకునే మనం- నిత్యవ్యవహారంలోనూ, రాసేటప్పుడూ అనునిత్యం ఎలా ఖూనీ చేస్తున్నామో చెప్పటం, మన భాషను సరిదిద్దాలని ప్రయత్నించటం (ప్రయత్నించటమని ఎందుకన్నానంటే- ఆయన ప్రయత్నమే చేయగలరు. మిగతాది మన బాధ్యత కనుక) ముదావహం. అలా ఆయన వారం వారం రాసిన వ్యాసపరంపర – నూరూ ఓ పుస్తకంగా రావటం మరింత సంతోషకరమైన విషయం. ఎందుకంటే- మళ్ళీ మళ్ళీ చదివితేగానీ వారు చెప్పిన అంశాలు మన మనసుల్లో ముద్రితం కావు కనుక. అందుకు పుస్తకరూపం అనువైన సాధనం కనుక.

తెలుగు మాతృభాష అయిన తెలుగు వాళ్ళందరికీ అప్రయత్నంగానే వస్తుంది. అయితే ఒంటబట్టాలంటే మాత్రం కొంత పరిశ్రమ తప్పనిసరి. రచయిత మనంచేసే తప్పులను ఎత్తిచూపారు. అందుకు మనం ‘కృంగి’ పోకూడదు. ‘క్రుంగి- కుంగి’ పోవాలంటారు రచయిత. యకారం, వువూ, వొవోలు తెలుగు మాటలకు ముందు లేవు. కనుక మనది ఇల్లే, ఊరేగానీ యిల్లూ, వూరూ కాదు. ఏ పదం తెలుగో, ఏది సంస్కృతమో తెల్సుకోవాల్సిన అవసరం వుంది. తెలుగు మాటల్లో ‘ఐ, ఔలను ‘అయ్, అవ్’లుగా రాస్తే ప్రమాదం లేదుగానీ, సంస్కృత శబ్దాలలో కూడని పని. మౌలిక సంస్కృతం కనుక- మవులికమని రాయటానికి వీల్లేదు. తెలుగు అల్పప్రాణాలను సంస్కృత మహాప్రాణాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇళ్ళకు శంకుస్థాపన చెయ్యాలిగానీ, శంఖుస్థాపన పనికిరాదు. శాఖాహారంతో కోతులవాల్సిన పనిలేదు. శాకాహారం తింటే ఫర్లేదు. అందుకు భాదపడొద్దు, బాధపడండి. ఏమిటీ విబేధం అనొద్దు – విభేదంట అది. ‘ముష్ఠి వెధవ’ వచ్చాడని తిట్టకండి. అతని ముష్టిఘాతం రుచి చూడాల్సిరావచ్చు. అక్షరాలు తారుమారయితే ప్రమాదం వుంది. ‘అర్ధ’మే తెల్సుకుంటే లాభంలేదు. ‘అర్థ’ సంపాదనకు అరకొర చదువులు పనికిరావు. ‘అంసం’ వేరు, ‘అంశం’ వేరు. తెలియకపోతే ‘అభిశంసన’ తప్పదు. ‘సభికుడు’ జూదగాడట, ‘సభ్యుడు’ కాదట. పదాది సంయుక్తాలుగా వుండే కొన్ని మాటలకు వాడుక తగ్గింది. ఎక్కడైనా ‘త్రేనిస్తే’ నాకో గుద్దు – గ్రుద్దుకాదు – గుద్దాలనిపిస్తుంది.

వివిధ భాషాభాగాలకు రూపం ఒకటిగా వున్నా, అర్థం ఒకటే అయివుండవచ్చు. వేరుగానూ ఉండొచ్చు. ‘ఏకు’ అంటే దూదిని శుభ్రం చేయటం, విమర్శించటం అని అర్థం. “ఏకు మేకయినప్పుడు, ఏకయివచ్చి మేకయి కూర్చున్నప్పుడు మెత్తగా వచ్చి ప్రమాదభరితంగా తయారవటమన్నమాట. ఈ ‘ఏకు’కు అర్థం ‘ఏకిన దూది చుట్ట’. క్రియా ప్రాతిపదిక మీద ‘డు’ వస్తే అది నామవాచకమయిపోతుంది. గోకుడు, గిల్లుడు లాంటి చక్కటి తెలుగు నామవాచకాలు ఏర్పడతాయి. ఇందులో తిరుగుడేం లేదు. మనకు మింగుడు పడకపోతే రచయితేం చేయగలడు! ‘పు’ ప్రత్యయంతో కూడా అలాంటి సౌలభ్యం వుంది. పిలుపు, పొడుపు- ఓర్పు పట్టండి. ఇంకా వుంది. బహుళ ప్రచారంలో వున్న కృత్ప్రత్యయాలలో ‘త’ ప్రత్యయం ఒకటి. క్రియాప్రాతిపదికలో ‘యు’ పోయి, ‘త’ వచ్చి కోయు కోత అవుతుంది. పార్లమెంటులో ‘కట్ మోషన్’ని కోత తీర్మానమ’ని అనువదిస్తాం. ‘పిట్టకొంచెం కూత ఘనం’ అన్నది సామెత. ‘వాడి గీత అట్లా వుంది’ అనీ అంటాం. పొగడ్తలూ, తెగడ్తలూ ఇలా వచ్చినవే. ‘ఇక’ ప్రత్యయంతో ‘తెగడిక’ అవుతుంది. పొందిక, ఎంపిక, కోరిక, దప్పిక కానీ, ఎరుక ‘క’ ప్రత్యయంతో ఏర్పడుతుంది. ‘ఇ’ ప్రత్యయంతో పిండు – పిండి అవుతుంది. ‘బాటు’ చేరి నగుబాటు, లొంగుబాటు, జరుగుబాటు ఏర్పడతాయి. అయితే, గుర్తించాల్సిన విషయం- భిన్న ప్రత్యయాలు భిన్నార్ధాలను కలిగిస్తాయని. ‘మోయు’ నుండి ‘మోపు’, ‘మోత’ ఏర్పడ్డాయి, రెండింటికి కొంత అర్థభేదం వుంది. తెలుగు పదాలపైనే కాక, సంస్కృత పదాలపై/కు చేరే ప్రత్యయాలు, ఉపసర్గల గూర్చి కూడా రచయిత చెప్పారు.

ఇలా మన భాషను గూర్చి మనం తెల్సుకోవాల్సిన ఎన్నో విషయాలను చంద్రశేఖరరెడ్డిగారు చెప్పారు. “రచనా ధోరణి చూస్తుంటే కృత్ప్రత్యయాదులను, ఇతర వ్యాకరణాంశాలనూ వివరిస్తూ మరోగ్రంథం వెలువరించబోతున్నట్లుంది. అలాగే జరుగుగాక!” అని ‘పరిచయం’ రాసిన బూదరాజు రాధాకృష్ణగారు చెప్పారు. అంతేకాదు, “భాషాపరిజ్ఞాన సాధనలో ఈ రచన చాలా ఉపకారమని పాఠకులకు తెలియజేస్తున్నాను” అని ప్రముఖ భాషావేత్త చెప్పటం నిజంగా చంద్రశేఖరరెడ్డిగారి రచనకు సర్టిఫికెట్టే. మనం ఈ పుస్తకం చదివి లాభం పొందాలి. సాధారణ పాఠకులకే కాదు, పాత్రికేయులకూ అవశ్యం పఠించాల్సిన (చదవటం కాదు) గ్రంథం ఇది.

-కాకాని చక్రపాణి

(కాకాని చక్రపాణి(1942-2017) వృత్తిరీత్యా ఇంగ్లిష్ లెక్చరర్. 37 ఏళ్ళపాటు హైదరాబాద్ ఆంధ్రసారస్వత పరిషత్ కళాశాలలో ఇంగ్లిష్ పాఠాలు చెప్పారు. జర్నలిజం కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ గా ఇంగ్లిష్, అనువాద పాఠాలు చెప్పారు. తెలుగులో చెయితిరిగిన కథా రచయిత. అనువాదకుడు. సాహితీ విమర్శకుడు. ఆంధ్రభూమి సచిత్రవారపత్రికలో 2002లో “మనభాష” పుస్తకంపై కాకాని చక్రపాణి సమీక్ష వ్యాసమిది)

రేపు:-
మన భాష-3
“నిరంతర ప్రవాహం భాష”

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

న్యూస్