Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని, మహిళలకు రక్షణ కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని ఏపీ ప్రతిపక్ష నేత, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.  హత్యకు గురైన రమ్య కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించి అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రకటనలోని ముఖ్యాంశాలు:

  • స్వతంత్ర  దినోత్సవ వేళ ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో పట్టపగలు నడిరోడ్డుపై దళిత యువతిని దారుణంగా హతమార్చారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయి?
  • వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలే లక్ష్యంగా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయి.
  •  ప్రభుత్వ చర్యలు నేరస్తులను ప్రోత్సహించేలా ఉండటం వల్లే ఇలా పేట్రేగిపోతున్నారు.
  • ముఖ్యమంత్రికి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని చీకటి జీవోలు ఇవ్వడంలో ఉన్న శ్రద్ధ మహిళలను రక్షించడంలో లేకపోవడం సిగ్గుచేటు.
  • ఆడబిడ్డలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.
    ఎటువైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయాందోళన చెందుతున్నారు. నిత్యం రాష్ట్రం నలుమూలలా ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది.
  • నిందితులకు రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు , కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి శిక్షించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చూస్తున్నాం.
  • రెండేళ్లలో మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి చేసింది ఏమిలేదు.
  • మహిళలపై 500కి పైగా జరిగిన లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు వైసీపీ అసమర్థ పాలనకు అద్దం పడుతోంది.
  • అన్యాయంగా బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రుల కడుపుకోత,  మృగాళ్ల చేతిలో అన్యాయానికి గురైన మహిళల ఘోష ముఖ్యమంత్రికి వినపడటం లేదా?
  • తమకు అన్యాయం జరిగిందని బాధితులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాధుడే లేడు.
  • పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నియంత్రృత్వ పాలన కొనసాగిస్తున్నారు
  • ఆంధ్రప్రదేశ్ లో దళితులు, మహిళలపై కొనసాగుతున్న అఘాయిత్యాలపై అమెరికా మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసిందంటే వైసీపీ ప్రభుత్వ భద్రతా వైఫల్యానికి అది నిదర్శనం.
  • తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మహిళా రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆర్టీజీఎస్ ద్వారా మానిటరింగ్ చేశాం.
  • మహిళల రక్షణ కోసం మేము తెచ్చిన ఫోర్త్ లైయన్ యాప్ ను కాపీ కొట్టి హడావుడి చేయడం మినహా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు?
  • టీడీపీ హయాంలో నిర్మించిన పోలీస్ స్టేషన్లను దిశా స్టేషన్లుగా మార్చి ప్రచారార్బాటం చేసిన ముఖ్యమంత్రి దిశా చట్టం కింద ఎంతమంది మృగాళ్లను శిక్షించారు?
  • గోడకు కొట్టిన బంతిలా కేంద్రం దగ్గర నుంచి దిశా బిల్లు తిరిగొచ్చింది. దిశా పోలీసులు జాడ లేదు. ముఖ్యమంత్రి ఇంటి వెనుక అత్యాచారం జరిగితే ఇంతవరకూ నిందితుల్ని పట్టుకోలేదు.
  • షాడోల చేతిలో డీజీపీ, మహిళా హోంమంత్రులను డమ్మిలుగా మార్చారు. అన్యాయంగా బలైపోయిన దళిత విద్యార్ధిని రమ్య కుటుంబసభ్యులను పరామర్శించే సమయం ముఖ్యమంత్రికి లేదా?
  • రమ్య కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. రమ్యలా బలైపోయిన ఎందరో ఆడబిడ్డల తల్లిదండ్రుల బాధ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు.

బాధిత మహిళలకు తెలుగుదేశం పార్టీ అండగా పోరాటం  చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com