సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్టంలో ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టి బైండోవర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్, ఇతర కమిషనర్లను బాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఇరు పార్టీల నేతలు కలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు, పవన్ లు మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల నిర్వహణకు అనుభవం ఉన్నవారిని వినియోగించాలని, కానీ తమకు అనుకూలంగా ఉండేవారిని నియమించేలా వైసీపీ ప్రవర్తించడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల విధులకు సెలెక్షన్ విధానంలో కాకుండా దేశవ్యాప్తంగా అమలు చేసే మంచి విధానాలను ఇక్కడ కూడా చేపట్టాలని కోరామని తెలిపారు.
రాష్ట్రంలో దొంగఓట్లు భారీగా చేర్చుకుంటున్నారని, దీనిపై గతంలోనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తయిందని, ఏపీలో కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా సక్రమంగా జరిగేలా చూడాలని కోరామన్నారు. ఒక్క దొంగ ఓటు ఉన్నా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్లి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ప్రధానాధికారి తాము చెప్పిన విషయాలను ఓపిగ్గా విన్నారని, ఎలాంటి అక్రమాలు జరగకుండా అన్ని చర్యలూ తీసుకుంటామని హామీ ఇచ్చారని బాబు తెలియజేశారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లు తొలగించడం సరికాదని, వారు ఎక్కడ ఉన్నా ఓటు హక్కు వినియోగించుకో వచ్చని… అమెరికాలో ఉన్నా వచ్చి పోలింగ్ లో పాల్గొంటారని… అంతే కానీ వారి ఓట్లు తీసేయడం మంచిది కాదన్నారు.
వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏర్పాటైన వ్యవస్థ అని దానిలో పనిచేసే వారిని ఎన్నికల విధులకు వినియోగిస్తే హింస జరిగే ప్రమాదం ఉందని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘానికి చెప్పామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రధానాధికారితో పాటు మొత్తం బృందం వచ్చిందంటేనే పరిస్థితిలోని సీరియస్ నెస్ ను అర్ధం చేసుకోవచ్చని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని వారు భరోసా ఇచ్చారని పవన్ వివరించారు.