Monday, June 17, 2024
HomeTrending Newsకాంగ్రెస్ లో లోక్ సభ ఎన్నికల కోలాహలం

కాంగ్రెస్ లో లోక్ సభ ఎన్నికల కోలాహలం

కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఎంపి సీట్లు కీలకం కావటంతో కాంగ్రెస్ నాయకత్వం ప్రతి స్థానంపై సర్వే చేయిస్తూ…పార్టీ వర్గాల ద్వారా ఆశావాహుల బలాబలాలు బేరీజు వేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో సాధారణ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిఎంగా తన స్థానం సుస్థిరం చేసుకునేందుకు రేవంత్ రెడ్డి 12 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. పిసిసి అధ్యక్ష పదవి అప్పగించటం దగ్గర నుంచి సిఎంగా ఛాన్స్ ఇవ్వటం వరకు అన్ని వేళలా రాహుల్ గాంధి…రేవంత్ రెడ్డికి అండగా ఉన్నారు. ఇప్పుడు అత్యధిక ఎంపి స్థానాలు గెలిచి రాహుల్ కు బహుమతిగా ఇవ్వాలని రేవంత్ సంకల్పంతో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

పార్టీ అధినేత్రి సోనియా గాంధిని ఖమ్మం నుంచి పోటీ చేయాలని పిసిసి ఆహ్వానించింది. సూత్రప్రాయంగా అధిష్టానం ఒకే చెప్పినట్టు సమాచారం. సోనియా గాంధి పోటీ చేస్తే తెలంగాణ క్యాడర్ లో ఉత్సాహం ఇనుమడిస్తుందని, పొరుగు రాష్ట్రాలైన ఏపి, ఛత్తీస్ గడ్, ఒరిస్సాలో ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. సోనియా గాంధి పోటీ చేయకపోతే మాజీ ఎంపి రేణుక చౌదరి, ఉపముఖ్యమంత్రి భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి బంధువు సిద్దంగా ఉన్నారు.

మెదక్ నుంచి విజయశాంతి, మల్కాజ్ గిరి నుంచి మైనంపల్లి హన్మంత్ రావు పేర్లు దాదాపు ఫైనల్ అయినట్టే అంటున్నారు. నల్గొండ నుంచి పటేల్ రమేష్ రెడ్డి పేరు పరిశీలనలో ఉన్నా మాజీ మంత్రి జానారెడ్డి రంగంలోకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. భువనగిరి నుంచి సిఎం అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. జానారెడ్డికి నల్గొండ ఇస్తే పటేల్ రమేష్ రెడ్డి భువనగిరి రావచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నిజామాబాద్ ఇంచార్జ్ ఇవ్వగా ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేయాలని ఆసక్తితో ఉన్నారని తెలిసింది. గతంలో కరీంనగర్ నుంచి పోటీ చేసిన అనుభవం, పరిచయాలు కలిసి వస్తాయని పార్టీ పెద్దలకు వివరిస్తున్నారు. జీవన్ రెడ్డి కరీంనగర్ వెళితే నిజామాబాద్ లో ఎవరు అనేది తేలాల్సి ఉంది. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఇరావత్రి అనీల్ పేర్లు పరిశీలించవచ్చు.

నాగర్ కర్నూల్ లో మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మధ్య పోటీ ఉంది. పెద్దపల్లిలో ఎవరనేది తేలటం లేదు. చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ పోటీ చేస్తారని ఇన్నాళ్ళు ప్రచారం జరుగగా… బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్తె డాక్టర్ వర్ష టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అన్నదమ్ముల పిల్లల మధ్య పోటీ నెలకొంది. అక్కా తమ్ముల్లలో ఒకరికి ఇస్తారా.. కొత్త ముఖం పరిచయం చేస్తారా త్వరలో తేలనుంది.

మహబూబాబాద్ లో మాజీ ఎంపి బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక్కడ కొత్త వారిని పోటీ చేయించాలనే ఆలోచన జరుగుతుందని సమాచారం. జహిరాబాద్ టికెట్ మాజీ ఎంపి సురేష్ షేట్కర్ ఖాయమని అంటున్నారు. నారాయణ్ ఖేడ్ లో మొదట షేట్కర్ పేరు ప్రకటించి ఆ తర్వాత సంజీవ రెడ్డికి ఇచ్చారు. దీంతో ఎంపి టికెట్ షేట్కర్ కే అని ఆయన అనుచరులు ధీమాతో ఉన్నారు.

ఆదిలాబాద్ నుంచి పోటీ చేసేందుకు శాసనసభ బరిలో ఓడిపోయిన అభ్యర్థులు సిద్దం అవుతుండగా AICC ఆదివాసి సెల్ సమన్వయకర్త కొట్నాక్ తిరుపతి పేరు తెరమీదకు వచ్చింది. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్ పోటీ చేస్తానని పిసిసి నాయకత్వం దృష్టికి తీసుకొచ్చారు. సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ లేదంటే ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ బరిలోకి దిగుతారని అంటున్నారు.

హైదరాబాద్ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సిఎం రేవంత్ రెడ్డి MIM కు చెక్ పెట్టె విధంగా అభ్యర్థి ఎంపిక ఉంటుందని తెలిసింది.  ఫిరోజ్ ఖాన్, అజరుద్దీన్ పేర్లు పరిశీలనలో ఉన్న కొత్త అభ్యర్థి రావచ్చని అంటున్నారు. మిత్ర పక్షం సిపిఐ ఒక సీటు ఆశిస్తోంది. ఒక స్థానం ఇస్తుందా…అందుకు బదులుగా మరేదైనా ఆఫర్ ఇస్తారా త్వరలో స్పష్టత రానుంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్