Saturday, April 20, 2024
HomeTrending News356 అధికరణ ప్రయోగించాలి: బాబు డిమాండ్

356 అధికరణ ప్రయోగించాలి: బాబు డిమాండ్

తెలుగుదేశం పార్టీ ఆఫీసులపై జరిగిన దాడికి నిరసనగా రేపు రాష్ట్ర బంద్ కు పిలుపు ఇస్తుస్తున్నట్లు టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తుకోసం బంద్ కు కలిసి రావాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఇది ప్రభుత్వం చేసిన దాడిగా అయన అభివర్ణించారు.  రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమికావాలని, 356 అధికరణ ప్రయోగించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయమై ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో రాజ్యం చేస్తున్న ప్రాయోజిత హింస జరుగుతోందని మండిపడ్డారు. అధికార పార్టీతో పోలీసు వ్యవస్థ కుమ్మక్కై ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.  ప్రజలకు సేవ చేసే, ప్రజా పోరాటాలు చేసే వేదిక లాంటి కార్యాలయంపై దాడి చేయడం శోచనీయమన్నారు. ప్రజలే దేవుళ్ళుగా భావించి, పార్టీ కార్యకర్తలంతా దేవాలయంగా భావించే టిడిపి కార్యాలయంపై, డిజిపి ఆఫీసు పక్కనే దాడి జరిగితే కాపాడలేని వారు రాష్ట్రాన్ని ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ఇది ముఖ్యమంత్రికి, డిజిపి తెలియకుండా జరిగిన దాడి కాదని అన్నారు.

ఒకే సమయంలో రాష్ట్రంలోని పలుచోట్ల దాడికి పాల్పడ్డారని, ఇది గర్హనీయమని, తాను డిజిపికి ఫోన్ చేస్తే స్పందన లేదని, గవర్నర్ ఫోన్ చేస్తే మాట్లాడారని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా మాట్లాడానని,  ఆయన దృష్టికి ఈ విషయాన్ని చెప్పామని తెలిపారు.

రాష్ట్రం డ్రగ్స్ మాఫియాకు కేంద్రంగా మారిందని, మాఫియాతో ఒక జాతి మొత్తం నిర్వీర్యం  అయ్యే ప్రమాదం ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గంజాయి సరఫరాపై, డ్రగ్స్ పై మాట్లాడితే ఇలాంటి దాడులకు పాల్పడతారా అని నిలదీశారు. తెలంగాణ పోలీసులు కూడా గంజాయి సాగు ఆంధ్ర ప్రదేశ్ నుంచే జరుగుతోందని నేడు ప్రెస్ మీట్ పెట్టి చెబితే ఇంతకంటే ఘోరమైన విషయం ఏముంటుందని ప్రశ్నించారు. సీలేరు, నర్సీపట్నం, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు, సరఫరా జరుగుతోందని తెలంగాణ పోలీసులు చెప్పారని, దానిపై చర్యలు తీసుకోకుండా తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టి, హింసకు దిగుతున్నారని బాబు ధ్వజమెత్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్