పట్టాభి మాట్లాడిన భాష తప్పయితే ముఖ్యమంత్రి, మంత్రులు వాడిన భాష ఏంటని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. మీ బూతుల మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఉపయొగిన్చిఅన భాష మీద; టిడిపి నాయకులు ఉపయోగించిన భాష మీద బహిరంగంగా చర్చిద్దామా, ఐదుకోట్ల ప్రజలను అడుగుదామా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమపై దాడులు చేసి మాపైనే ఎదురు కేసులు పెడతారా అని నిలదీశారు. టిడిపి కార్యాలయాలపై జరిగిన దాడులను నిరసిస్తూ మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో 36 గంటల ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ దీక్షను చంద్రబాబు ప్రారంభించారు.
ఈ సందర్భంగా బాబు మట్లాడుతూ ఇంతవరకూ తన మంచితనమే చూసారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇకపై తానెంతో చూపిస్తానని, ఖబడ్దార్ జాగ్రత్త అంటూ పోలీసులను, సిఎం జగన్ ను హెచ్చరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, తాము 356 అధికరణ ప్రయోగించడానికి వ్యతిరేకమని, కానీ ఇక్కడి పరిస్థితి చూసిన తర్వాత రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేశామని చెప్పారు.
దేశ చరిత్రలో ఎన్నడూ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదని, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఒక పద్దతి ప్రకారం దాడులకు పాల్పడ్డారని, ఇది ఒక కుట్ర ప్రకారం జరిగిందని ఆరోపించారు. దాడుల విషయం తెలియగానే వెంటనే డిజిపికి ఫోన్ చేస్తే అయన బిజీగా ఉన్నారని సమాచారం చెప్పారని, గవర్నర్ కు ఫోన్ చేసి విషయం చేపానని చంద్రబాబు వివరించారు. పోలీసులు, వైఎస్సార్సీపీ గూడాలు కలిసి ఈ దాడులకు పాల్పడుతున్నారని తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానన్నారు. తమ హెడ్ క్వార్టర్స్ పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రక్షణ కల్పించలేని పోలీసు వ్యవస్థకు, డిజిపికి సిగ్గనిపించడం లేదా అని బాబు ప్రశ్నించారు. మొత్తం పోలీసు వ్యవస్థను మూసివేసి ఇంటికి వెళ్ళాలని సూచించారు
ముఖ్యమంత్రి చేస్తున్న తప్పులు, డబ్బుల వ్యామోహంతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని, శాశ్వతంగా రాష్ట్రం నాశనమయ్య పరిస్థితి వచ్చిందని బాబు విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి మూలాలు దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తల అరెస్టులపై చూపుతున్న ప్రతాపం డ్రగ్స్ అరికట్టడంపై చూపాలని సిఎం, డిజిపిలను ఉద్దేశిస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ దీక్షలో పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.