Friday, March 29, 2024
HomeTrending Newsఅధికారం దక్కదనే దుగ్ధతోనే... : సిఎం జగన్

అధికారం దక్కదనే దుగ్ధతోనే… : సిఎం జగన్

అధికారం దక్కలేదని, ఇకపై దక్కదన్న దుగ్ధతో కొందరు విపక్ష నేతలు తనను నీచమైన, దారుణమైన, అసభ్య పదజాలంతో దూషించే స్థితికి చేరుకున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యంగ పదవిలో ఉన్నవ్యక్తిపై, అతని తల్లిని ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడడం సబబేనా అని సిఎం ప్రశ్నించారు. ఇలా దూషించినందుకు తనను అభిమానించే వారు తిరగబడాలని, రెచ్చిపోయి వారేదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే, వాటి ద్వారా గొడవలు సృష్టించాలని విపక్షం ఆరాట పడడం సమంజసమేనా అని సూటిగా నిలదీశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సిఎం పాల్గొన్నారు. హోం మంత్రి మేకతోటి సుచరిత, డిజిపి గౌతం సావంగ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సిఎం మట్లాడుతూ రాష్ట్రంలో నేరం కొత్త కొత్త రూపాల్లో దాడిచేస్తోందని, వివిధ రూపాలు సంతరించుకుంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాజకీయ నాయకుల అవతారంలో కూడా నేరం కొత్త అవతారం ఎత్తిందన్నారు. ఈ శక్తులు రెండున్నరేళ్లుగా ఎలాంటి నేరాలు చేస్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని, రథాలు తగులబెడుతున్నారని,  కులాలు-మతాల మధ్య చిచ్చుపెట్టడానికి ఏమాత్రం సంకోచించడంలేదని, సంక్షేమ పథకాలను అడ్డుకోవడం కోసం కోర్టుల్లో కేసులు వేయిస్తూ ఇళ్ళ నిర్మాణం కూడా ఆపారని, పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదని అంటున్నారని ముఖ్యమంత్రి వివరించారు.

మరో వైపు కొన్ని మీడియా సంస్థలు, మావాడు అధికారంలోకి రాకపోతే అబద్దాలే వార్తలుగా, వార్త కథనాలుగా… అబద్దాలే డిబేట్లుగా నడుపుతామంటున్న పచ్చపత్రికలు, పచ్చ ఛానెళ్ళను కూడా మనం చూస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించారు.

డ్రగ్స్ వ్యవహారంలో కూడా పచ్చి అబద్ధాలని పదే పదే చెబుతూ గోబెల్స్ ప్రచారం చేస్తూ రాష్ట్రం మీద దాడి చేస్తూ, పిల్లల భవిష్యత్ ను కళంకం చేస్తున్నారని సిఎం విమర్శించారు. ఇది తన ఒక్కడి మీద చేస్తున్న దాడి మాత్రమే కాదని, యావత్ రాష్ట్రం మీద చేస్తున్న దాడి అని సిఎం అభివర్ణించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు సైతం ఈ  డ్రగ్స్ విషయంలో  రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పినా కూడా లెక్కలేని తనంతో, అక్కసుతో ఓ పథకం ప్రకారం కుట్ర పూరితంగా రాష్ట్ర పరువు ప్రతిష్టలను దిగజార్చేందుకు సైతం సిద్ధపడ్డారని సిఎం వివరించారు.

అధికారం చేపట్టిననాటినుంచి సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నామని, ఆ కోవలోనే పోలీసుల సంక్షేమం పట్ల కూడా తాము ఎన్నో చర్యలు తీసుకున్నామని చెప్పారు. తీవ్రవాదాన్ని, అసాంఘీక శక్తులను ఏమాత్రం ఉపేక్షించ వద్దని సిఎం సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్