స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయి అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయిందనే విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు సీమెన్స్ సంస్ధ అధికారులు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారని వెల్లడించారు. సీఆర్పీసీ 164 కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారని, ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు, తమకు ఎలాంటి సంబధం లేదని కోర్టులో చెప్పారని సిఎం వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ పై అసెంబ్లీలో జరిగిన చర్చలో సిఎం జగన్ పాల్గొని మాట్లాడారు.
“నేను బటన్ నొక్కితో డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి, నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు బటన్ నొక్కితే అంతా ప్రభుత్వ ఖాతా నుంచి అటు తిరిగి, ఇటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డీపీటీ కార్యక్రమం. ఇంత దారుణంగా జరిగాయి” అని ఎద్దేవా చేశారు.
“ప్రభుత్వం నుంచి పదిశాతం డబ్బులు విడుదల చేసినప్పుడు, సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. ఉదారంగా సీమెన్స్ నుంచి మనకు ఇవ్వాల్సింది ఒక్క పైసా కూడా రాకుండానే… ఐదు దఫాల్లో కేవలం మూడు నెలలు కాలంలోనే ప్రభుత్వం రూ.370 కోట్లు విడుదల చేసింది. అంటే ప్రభుత్వం నుంచి ఇన్‌స్టాల్‌మెంట్ పోతుంది ఆ మొత్తం సెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్లీ సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తారు” అంటూ నాటి వ్యవహారంపై వివరాలు బహిర్గతం చేశారు.
“ఈ డబ్బు విడుదలపై ఆర్ధికశాఖ అధికారులు ప్రశ్నిస్తే…ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారంటే. సాక్షాత్తూ చంద్రబాబే. ఈ విషయాన్ని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్‌లో .. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు తాను నోట్ ఫైల్‌లో చెప్పారు” అంటూ సంబంధిత పత్రాలను అసెంబ్లీలో ప్రదర్శించారు.
ఈ విషయాలన్నింటినీ సీఐడీ దర్యాప్తు చేస్తూ.. స్కాంకు సహకరించిన వారిని అరెస్టు చేస్తుంటే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోందని సిఎం అన్నారు. “ఈ కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురిని అరెస్టు చేసి ఈడీ ట్వీట్ కూడా చేసింది. అందులో ఏముందంటే సీమెన్స్ ఇండస్ట్రీ ఎక్స్ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌ను, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైయివేటు లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్‌ను, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్‌ను అరెస్టు చేసి వాళ్లను పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టి, 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది” అని వివరించారు.
సభ ద్వారానైనా వాస్తవాలేమిటన్నది ఎమ్మెల్యేలకే కాకుండా, ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా సాక్ష్యాలు, ఆధారాలతో తాను వివరించాల్సి వచ్చిందని సిఎం పేర్కొన్నారు.