తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికల కోసం పెద్ద కసరత్తే చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేదుకు ప్రణాళికలు సిద్దం చేశారు. దీంతో ఇప్పటికే జనసేనతో పొత్తుకు సిద్దమైన టిడిపి తాజాగా బిజెపితో కలిసి సాగేందుకు సన్నద్ధమైంది.
బిజెపితో చర్చలు జరిపిన బాబు సీట్ల విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. బిజెపి ఎంపి స్థానాలు అధికంగా కోరుతుండగా… ఎమ్మెల్యే, ఎంపి స్థానాలు సమపాళ్ళలో ఇస్తామని టిడిపి ఆఫర్ చేస్తోందని సమాచారం. జనసేనకు రెండు, బిజెపికి ఏడు స్థానాలు ఇస్తే 18 స్థానాలు మిగులుతాయి. ఎంపి స్థానాలు అధికంగా ఉంటేనే కేంద్ర ప్రభుత్వంతో బేరసారాలకు అవకాశం ఉంటుందని… రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవటం ఎంత ముఖ్యమో…ఎంపి స్థానాలు అంతే ముఖ్యమని తెలుగు తమ్ముళ్ళు చర్చించుకుంటున్నారు.
టిడిపి, బిజెపి, జనసేన కలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావటం సులువని కూటమి నేతలు ఉత్సాహంగా ఉన్నారు. అయితే బిజెపితో పొత్తు కొంత చేటు చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. క్రైస్తవులు, ముస్లీం వర్గాల ఓట్లు కూటమికి దూరం అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. రాయలసీమ, సర్కారు జిల్లాల్లో ఈ రెండు వర్గాలు ప్రభావంతంగా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నష్ట నివారణకు దిగిన నాయకత్వం కొత్త ఎత్తుగడ వేస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ప్రభావం చూపే విధంగా చంద్రబాబు కార్యాచరణకు దిగారు. అందులో భాగమే నారా భువనేశ్వరి ఈ రోజు చేసిన వ్యాఖ్యలు అని అంటున్నారు.
చంద్రబాబునాయుడు 35 ఏళ్ళుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈ ఎన్నికల్లో ఆయనకు విశ్రాంతి ఇద్దామని, ఆయన బదులు పోటీచేయాలనే ఆలోచన తనకుందని చంద్రబాబు భార్య భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ పోటీ చేసే ఆంశం తన మనసులో మాట అని కార్యకర్తలతో అన్నారు.
భువనేశ్వరి వ్యుహాత్మకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. కుప్పంలో భువనేశ్వరి, హిందూపురంలో బాలకృష్ణ, మంగళగిరిలో లోకేష్, బాబు ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేసే విధంగా నక్ష సిద్దం చేశారని తెలిసింది. బిజెపి నుంచి ఎంపిగా పురుందేశ్వరి విశాఖ నుంచి బరిలో ఉంటానని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.
అన్ని ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు పోటీ చేసి… అధికార పార్టీని కట్టడి చేయాలని యోచనగా ఉందని తెలుగుదేశం వర్గాల్లో టాక్ మొదలైంది. ఉత్తరాంధ్రలో అచ్చేనాయుడు వైఖరి, ఒంటెత్తు పోకడలు తెలుగు తమ్ముళ్ళను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తున్నాయి. ఇక్కడ బాబు పోటీ చేస్తే బాగుంటుందని పార్టీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి పోటీ చేస్తారని ఆయా జిల్లాల నేతలు భరోసాతో ఉన్నారు.
కాగా భువనేశ్వరి వ్యాఖ్యలపై స్పందించిన వైసీపీ నేతలు కుప్పంలో బాబుకు ఓటమి భయం పట్టుకుందని అందుకే అక్కడినుంచి పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని విమర్శించారు. భువనేశ్వరి వ్యాఖ్యలు బాబు ప్రణాళికలో భాగమేనని వారు ఎద్దేవా చేశారు.
-దేశవేని భాస్కర్