Saturday, July 27, 2024
HomeTrending Newsరాష్ట్ర ప్రయోజనాలకోసమే పొత్తు: పవన్ కళ్యాణ్

రాష్ట్ర ప్రయోజనాలకోసమే పొత్తు: పవన్ కళ్యాణ్

సిఎం జగన్ సిద్ధం అంటే తాము యుద్ధం అంటామని….కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పవాడా కాదా అనేది ముఖ్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో కులాలను కలిపి ఉంచే నేతలను గుర్తు పెట్టుకుంటారని, కానీ సిఎం జగన్ కులాలను విడదీసి రాజకీయం చేస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని, బిసి కులాలు ఎదగడం అంటే కాపులు, ఓసీ కులాలు తగ్గిపోవడం కాదని స్పష్టం చేశారు. దళిత కులాల నుంచి దామోదరం సంజీవయ్య లాంటి నేతలు రావాలని అభిప్రాయపడ్డారు. భీమవరంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పవన్ ప్రసంగించారు. ఒక బలమైన భావంతో, సిద్ధాంతంతో లక్షలాది మందిని కట్టిపడేయడమే పార్టీ అని, గెలుపు ఓటమిలు కాదని…రెండుచోట్లా ఓడిపోయినా పార్టీని ఆ బలంతోనే నడుపుతున్నానని పేర్కొన్నారు.

దక్షిణ భారతదేశం నుంచి నరేంద్రమోడీకి మొదటగా మద్దతు తెలిపింది తానేనని, ఒక నాయకుడిని నమ్మితే చిత్తశుద్ధిగా నమ్ముతానని చెప్పారు. డబ్బుతో ఓట్లు కొనే పరిస్థితి మారాలని, మరో పదేళ్ళ తరువాత అయినా ఈ రాజకీయంలో మార్పు వస్తుందని తాను విశ్వసిస్తున్నానని… అప్పుడైనా అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సిఎం జగన్ అప్పులు తెచ్చి బటన్లు నొక్కుతున్నారని, అభివృద్ధి చేసి బటన్లు నొక్కితే అప్పుడు సలాం కొడతామన్నారు.  తమ కూటమి అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పథకాలు కొనసాగిస్తామని, దానితో పాటు అభివృద్ధి కూడా చేస్తామని భరోసా ఇచ్చారు. అప్పుల్లో కూరుకున్న, అభివృద్ధికి దూరమైన, క్రిమినాలిటీ పెరిగిన ఆంధ్ర ప్రదేశ్ ను రక్షించడానికే తాము కలిసి పని చేస్తున్నామన్నారు.

తాము ఒంటరిగా పోటీ చేస్తే 40 స్థానాల్లో గెలుస్తామని, కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నామని… ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు ఉంటుందని, ప్రతి అడుగూ వ్యూహాత్మకంగానే ఉంటుందని, కూటమి అభ్యర్ధుల గెలుపుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పిలుపు ఇచ్చారు.  ఈ ఉదయం భీమవరం చేరుకున్న పవన్ కు జన సైనికులు ఘన స్వాగతం పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్