Charge Sheet : రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, నిర్వాసితుల ఆత్మహత్యలకు కారణం టీఆరెస్ ప్రభుత్వమేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. గొర్ల మందపై తోడేళ్ళలా, మిడతల దండులా మునుగోడు ప్రజలపై దాడి చేయడానికి టీఆరెస్, బీజేపీ లు వస్తున్నాయన్నారు. టీఆరెస్,బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాలపై చార్జిషీట్ ను ఈ రోజు మునుగోడులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుందూరు జానారెడ్డి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మునుగోడు ప్రాంతంలో ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సిందిపోయి.. కేవలం ఉప ఎన్నికలపైనే టీఆరెస్,బీజేపీ లు దృష్టి పెట్టాయన్నారు.
సెప్టెంబర్ 17 నుంచి 2023 సెప్టెంబర్ 17 వరకు వజ్రోత్సవాలు జరుపుకోవాలని కాంగ్రెస్ పక్షాన పిలుపునిస్తున్నామన్న రేవంత్ రెడ్డి తెలంగాణ పోరాట చరిత్రను దేశానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఊరూరా వజ్రోత్సవాలు చేయాలని, గతంలో కాంగ్రెస్ ను విమర్శించిన కేసీఆర్… ఎనిమిదేళ్లుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం లేదని మండిపడ్డారు. కెసిఆర్ ఎవరికి లొంగిపోయారు, ఎవరి ముందు వంగిపోయారని ప్రశ్నించారు.
సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించనదుకు కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒకరిది 41 అయితే ఒకరిది 21.. కానీ కాంగ్రెస్ పార్టీది 140 ఏండ్ల చరిత్ర అన్నారు. తెలంగాణ సమాజాన్ని నిజాం నుంచి విముక్తి కలిగించింది కాంగ్రెస్ అని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ అన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రేస్ పార్టీదని, చెప్పుకోవడానికి చరిత్ర లెనోళ్లు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.
మనం పార్టీ ఫిరాయింపు దారుల పక్షాన ఉన్నామా.. ఎవరి పక్షాన ఉన్నామో ప్రజలు గమనిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మునుగొడులో కాంగ్రెస్ ఓటుబ్యాంకు 97 వేల ఓట్లు..మనం కలిసికట్టుగా ఉండి ఓటుబ్యాంకును కాపాడుకుంటే.. కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకే అన్నారు. కాంగ్రెస్ ను ఓడించే శక్తి ఆ మోడీకి లేదు.. ఈ కేడీకి లేదని, రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సర్వం అండగా నిలిస్తే.. ఇప్పుడు మోడీకి 22వేల కోట్లకు అమ్ముడిపోయాడని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అమ్ముడు పోయే సన్నాసులకు నిధులు వచ్చాయి తప్ప.. నియోజక వర్గంలో ఏ గ్రామనికైనా నిధులొచ్చాయా? అన్నారు.
ప్రజల తీర్పును కుదువపెట్టిన వారికే ఇవాళ నిధులు వచ్చాయి తప్ప ఎవరికీ ఒరిగిందేమీ లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను చూస్తే జాలేస్తుందని, మిమ్మల్ని కొనుక్కుపోయి మీ పార్టీని బొందపెట్టిన టీఆరెస్ కు మీరు మద్దతు ఇస్తారా…అని ప్రశ్నించారు. నాయకులు ఎక్కడికైనా పోనీ… మునుగోడు కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండని విజ్ఞప్తి చేశారు. విమోచన దినోత్సవం పేరుతో మత కల్లోలం సృష్టించాలని బీజేపీ కుట్ర చేస్తోందని, ప్రజల్లో చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పండని మునుగోడు ప్రజలకు రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
Also Read : బిజెపి, తెరాసల ఫిరాయింపు రాజకీయాలు రేవంత్ రెడ్డి