ఐసిసి టి-20 వరల్డ్ కప్ సూపర్-12 రౌండ్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక 80(49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. భానుక రాజపక్ష కూడా 31 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లతో 53 పరుగులతో రాణించాడు. బంగ్లాదేశ్ విసిరిన 171 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18.3 ఓవర్లలోనే చేరుకుంది.
షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఓపెనర్లు తొలి వికెట్ కు 40 పరుగులు చేశారు. లిటన్ దాస్ 16 బంతుల్లో 16పరుగులు చేసి ఔటయ్యాడు. షకీబ్ అల్ హసన్ కూడా త్వరగా ఔటయ్యాడు. ఈ దశలో ఓపెనర్ మహమ్మద్ నయీం, ముష్ఫిఖర్ రహీం లు మూడో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. నయీం 52 బంతుల్లో 6ఫోర్లతో 62; రహీం 37 బంతుల్లో 5ఫోర్లు 2 సిక్సర్లతో 57 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. కరునరత్నే, ఫెర్నాండో, లాహిరు కుమార తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే మొదటి వికెట్ కోల్పోయింది. కుశాల్ పెరీరా ఒక పరుగుకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ నిశాంక, అసలంకతో కలిసి రెండో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఎనిమిదో ఓవర్లో బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ ఇద్దరు లంక బ్యాట్స్ మెన్ ను బౌల్డ్ చేశాడు. ఆతర్వాతి ఓవర్లో హసరంగ కూడా అవుట్ కావడంతో లంక శిబిరంలో కాస్త ఆందోళన నెలకొంది. అయితే రాజపక్ష, అసలంక ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 86 పరుగులు జోడించి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
చరిత్ ఆసలంక ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు.