ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై ఇచ్చిన 158 పరుగుల విజయ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి మరో 11 బంతులు మిగిలి ఉండగానే చెన్నై ఛేదించింది.
ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇషాన్ కిషన్-32; టిమ్ డేవిడ్-31; తిలక్ వర్మ-22; రోహిత్ శర్మ-21; కృషిక్ షోకీన్-18 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 3; తుషార్ దేశ్ పాండే, మిచెల్ శాంట్నర్ చెరో రెండు, మగల ఒక వికెట్ పడగొట్టారు.
చెన్నై పరుగుల ఖాతా తెరవక ముందే డెవాన్ కాన్వే వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదిగా ఆడగా, అజింక్యా రేహానే మెరుపు ఇన్నింగ్స్ ఆడి 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. రెండో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత వచ్చిన శివం దూబే 28 పరుగులు చేసి వెనుదిరిగాడు. రుతురాజ్ 36 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్ తో 40; అంబటి రాయుడు 16 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులతో అజేయంగా నిలిచారు.
ముంబై బౌలర్లలో జేసన్ బెహన్డ్రాఫ్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ తలా ఒక వికెట్ సాధించారు.
రవీంద్ర జడేజా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లబించింది.