CM Jagan met CJI: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఏర్పాటు చేసింది. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. జగన్ దంపతులు జస్టిస్ రమణ దంపతులను హై టీ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా , హైకోర్టు న్యాయమూర్తులు, డిప్యూటీ సీఎంలు, మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జస్టిస్ రమణ సీఎం జగన్ తో కలిసి కేక్ కట్ చేశారు.
అంతకుముందు జస్టిస్ రమణను సిఎం జగన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మూడురోజుల పాటు పర్యటిస్తున్న జస్టిస్ రమణ నేడు రెండోరోజు విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో పుర ప్రముఖులను, పలువురు సామాజిక, సంఘ సేవకులను, వివిధ వర్గాల ప్రజలను కలుసుకున్నారు.
పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న అనంతరం గన్నవరం చేరుకున్న సిఎం జగన్ తన సతీమణి వైఎస్ భారతితో కలిసి అక్కడినుంచి నేరుగా జస్టిస్ రమణ బస చేస్తున్న నోవాటెల్ కు చేరుకొని ఆయన్ను కలుసుకున్నారు.