Saturday, November 23, 2024
HomeTrending Newsయడ్యూరప్ప రాజీనామా   

యడ్యూరప్ప రాజీనామా   

కర్ణాటక రాజకీయాలపై కొన్ని రోజులుగా సాగుతున్న ఉహాగానాలకు తెరపడింది.  ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్దమయ్యారు. కొద్దిసేపటి క్రితం తన రాజీనామా అంశాన్ని దృవీకరించారు. కాసేపట్లో గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు.

ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఈశ్వరప్ప గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈశ్వరప్ప ఫిర్యాదు రాష్ట్రంలో సంచనలం సృష్టించింది.  యడ్యూరప్ప కుమారుడు మంత్రుల శాఖల్లో పెత్తనం చేస్తున్నారని పర్యాటక శాఖమంత్రి యోగీశ్వర బహిరంగ ఆరోపణలు చేశారు. యడ్యూరప్పకు వ్యతిరేకంగా 80 శాతం మంది ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ అర్జున్ సింగ్ కు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్సీ విశ్వనాధ్ ఇదివరకే ప్రకటించారు.

ఫిర్యాదుల్ని పరిగణనలోకి తీసుకున్న బిజెపి జాతీయ నాయకత్వం కర్ణాటకలో పార్టీని సరిదిద్దే పనులు చేపట్టింది. ఇందులో భాగంగానే యడ్యూరప్ప సన్నిహితురాలు శోభకరంద్లాజే కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. సిఎం పదవి చేపట్టి ఈ రోజుతో రెండేళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా భారీ విందు కార్యక్రమం ఏర్పాటు చేసిన యడ్యూరప్ప ,ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ఎలాంటి విందు లేదని ప్రకటించారు. అప్పుడే యడ్యూరప్పకు ఎదురుగాలి మొదలైందని సంకేతాలు వెలువడ్డాయి.

కర్ణాటక రాజకీయాలు విలక్షనమైనవి. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన స్వాములు, మఠాలు అధికంగానే ఉన్నాయి. ఈ వర్గంలో కూడా యడ్యూరప్పకు పరపతి మెండుగానే ఉంది. ఎంతమంది ఆశీస్సులు ఉన్నా ప్రజల్లో పార్టీ పలుచన అవుతే దుద్దుబాటు చర్యలు తప్పవు.

అయితే ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం మొత్తం పరిశీలిస్తే కాంగ్రెస్ అడుగుజాడల్లోనే బిజెపి నడుస్తోంది. పూర్తి కాలం పదవిలో కొనసాగే అవకాశం కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పడు బిజెపి ని కూడా అదే జాడ్యం పట్టుకుంది. వ్యవహారం  గుట్టుగా ఉంచి సదరు నేతతోనే రాజీనామా ప్రకటన ఇప్పించటం కాంగ్రెస్ నైజం.  ఈ రోజు ఉదయం వరకు యడ్యూరప్ప రాజీనామాపై జాతీయ నేతలు ఎవరు స్పష్టత ఇవ్వలేదు. పైగా యడ్యూరప్ప సమర్థుడైన నేత అని ప్రకటనలిచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిటి రవి ఆల్ ఈజ్ వెల్ అన్నారు. రెండు రోజుల క్రితం గోవా పర్యటనలో ఉన్న బిజెపి అధ్యక్షుడు జయ ప్రకాష్ నడ్డ మీడియా నే ప్రచారాలు చేస్తోందన్నారు. యడ్యూరప్ప పాలనలో లోపం లేదని ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఎదురు ప్రశ్నలు వేశారు. వీటన్నింటిని పరిశీలిస్తే క్రమశిక్షణ, కట్టుబాట్లు చెప్పుకునే బిజెపిలో కాంగ్రెస్ సంస్కృతి ప్రవేశించిందనటంలో సందేహం లేదు.

యడ్యూరప్ప రాజీనామాతో కొత్త సిఎం ఎవరనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేరు ఎక్కువగా ప్రచారంలో ఉంది. హోం శాఖ మంత్రి ఎస్ ఆర్ బొమ్మాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప లింగాయత్ సామాజిక వర్గం నుంచి రాష్ట్రంలో బలమైన నేతగా ఉన్నారు. సిఎం పదవి మళ్ళీ తమ సామాజిక వర్గానికే దక్కాలనేది లింగాయత్ ల డిమాండ్ గా ఉంది. రాష్ట్ర జనాభాలో 17 శాతం ఉన్న లింగాయత్ వర్గం మొదటి నుంచి ఐకమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకుంటున్నారు. ఈ వర్గం నుంచి రమణ గౌడ యత్నాల్, అరవింద్ బల్లాడ్, మురగేష్ నిరానీ ల పేర్లు సిఎం రేసులో ఉన్నాయి.

యడ్యూరప్ప రాజీనామా చేస్తే రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం నిలదొక్కుకోవటంపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాదిలో ఒకే ఒక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి యడ్యూరప్పను తప్పిస్తే కష్టాలు ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్