ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లు ప్రజాస్వామ్య పద్దతిలో పాలన కొనసాగించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి చేస్తుంటే చైనా చాప కింద నీరులా తన పని తానూ చేసుకుంటోంది. ఆఫ్ఘన్ లో గనుల తవ్వకాల కోసం ఒప్పందం చేసుకున్న చైనా త్వరలోనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. మెట్రలాజికల్ కార్పోరేషన్ అఫ్ చైనా (MCC) ఆఫ్ఘన్ లో గనుల తవ్వకానికి అనుమతులు తీసుకుంది. చైనాకు చెందిన ఐదు కంపెనీలు గనుల తవ్వకాల కోసం గత ఏడాది నవంబర్ లోనే సర్వే చేశాయి. మొదట లోగార్ రాష్ట్రంలోని మేస్ ఆయంక్ గనుల్లో కాపర్ తవ్వకాలు మొదలు కానున్నాయి. ఇందుకోసం ఈ నెలాఖరులో MCC కాబుల్ లో కార్యాలయం ప్రారంభిస్తోంది. చైనా కంపెనీలకు అన్ని అనుమతులు ఇచ్చినట్టు ఆఫ్ఘన్ గనుల శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అశ్వతుల్ల బుర్హాన్ ప్రకటించారు.
ఆఫ్ఘన్లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఆ దేశంలో పాగా వేయాలని మొదటి నుంచి చైనా పావులు కదుపుతోంది. ఆఫ్ఘన్లో అపారమైన లిథియం నిల్వలపై చైనా కన్ను పడింది. ఇందుకోసం పాకిస్తాన్, రష్యా లతో జతకట్టిన చైనా తాలిబన్లకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. అదే సమయంలో తాలిబన్లు కూడా చైనా జింజియాంగ్ ప్రావిన్సు లో వుయ్ఘుర్ ముస్లీంల ఉచకోత జరుగుతున్నా ఖండించలేదు. తాజాగా రష్యా ఉక్రెయిన్ పై దాడుల్లో మునిగితేలుతుండగా … ప్రపంచదేశాలు రష్యా పై ఆంక్షలు, విమర్శల పర్వంలో ఉన్నాయి. ఇదే అదునుగా చైనా కంపెనీలు ఆఫ్ఘన్లో గనుల తవ్వకాలకు అనుమతులు పొందాయి. పాకిస్తాన్లోని బెలోచిస్తాన్ రాష్ట్రంలో గనుల పేరుతో దోపిడీ చేస్తున్న చైనా కంపెనీలపై స్థానికులు తిరగబడుతున్నారు. ఏడాది గడిచేసరికి చైనా కంపెనీల దాష్టికాలు ఆఫ్ఘన్ ప్రజలకు అనుభవంలోకి రానున్నాయి.