ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల పాలన కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. చైనా అధ్వర్యంలో బీజింగ్ లో జరిగిన విదేశాంగ మంత్రుల సమావేశంలో చైనా, ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తుర్కమేనిస్తాన్, రష్యా దేశాల తరపున విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఆఫ్ఘన్ లో తాలిబాన్ల పాలన సుస్థిరం చేసేందుకు జరిగిన సమావేశంలో ఇది మూడోది. ఈ సమావేశానికి ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకి నేతృత్వంలో హాజరైన ప్రతినిధి బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాల మధ్య ఆర్థిక, రాజకీయ సహకారం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆఫ్ఘనిస్తాన్ లో శాంతి స్థాపన, పరిపాలన సుస్థిరం కాకపోతే పొరుగు దేశాలు సమస్యలు ఎదుర్కోవలిసి వస్తుందని, తాలిబాన్ లు మానవ హక్కులు, మహిళా హక్కుల విషయంలో పట్టుదలకు పోవద్దని ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేయిన్ అమీర్ అబ్దోల్లహియన్ స్పష్టం చేశారు. ఆఫ్ఘన్ లో శాంతి నెలకొనేందుకు చైనా చొరవ చూపటం సంతోషకరమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబినందించారు.
అయితే ఈ సమావేశంపై అంతర్జాతీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. పాకిస్తాన్, చైనా దేశాలు తమ అవసరాల కోసం ఆఫ్ఘన్ విషయంలో చొరవతీసుకుంటున్నాయని అంటున్నారు. ఆఫ్ఘన్ లో పేదరికం, మానవ హక్కుల ఉల్లంఘన, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు పాకిస్తాన్, చైనా దేశాలను హడలెత్తిస్తున్నాయి. వలసలు పెరుగుతాయని ఈ రెండు దేశాలు భయపడుతున్నాయి. ఆఫ్ఘన్ లో ఖనిజ సంపద మీద కన్నేసిన చైనా కాబుల్ లో తాలిబాన్లు ఉంటేనే మేలు అనే విధంగా వ్యవహరిస్తోంది.
Also Read : చైనా ఉత్పాదనలపై యాంటీ డంపింగ్ డ్యూటీ