జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యానికి చేరుకోవడానికి పట్టుదల ఉండాలి. ఆ పట్టుదల నుంచి జారిపోకుండా .. విరామమనేది లేకుండా శ్రమించాలి. అలుపెరగని ఆ కృషి ఒక యజ్ఞంలా సాగాలి .. ఒక తపస్సును తలపించాలి. ఎన్ని కష్టాలు ఎదురైనా .. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంలో పోరాడాలి. అవమానాలను అభివృద్ధికి మెట్లుగా భావించాలి .. అవాంతరాలను అంకితభావంతో అధిగమించాలి. అలాంటి పరిస్థితులను దాటుకుంటూ, విమర్శలకు విజయానికి మించిన విరుగుడు లేదు అని నిరూపించిన కథానాయకుడిగా చిరంజీవి కనిపిస్తారు.
చిరంజీవి పశ్చిమగోదావరి జిల్లా ‘మొగల్తూరు’లోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. నరసాపురంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయనకి, నటన వైపుకు మనసు మళ్లింది. స్నేహితుల ప్రోత్సాహం కూడా తోడవడంతో తెరపై తనని తాను చూసుకోవాలనే ఒక కోరిక బలపడింది. దాంతో ఆయన మద్రాసుకు చేరుకుని, నటనలో మెళకువలు నేర్చుకోవడానికి ఒక ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఆ తరువాత సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు.
అలా ఆయనకు ‘పునాదిరాళ్లు’ సినిమాతో తొలి అవకాశం వచ్చింది. మొదటిసారిగా ఈ సినిమా కోసం ఆయన కెమెరా ముందుకు వెళ్లినప్పటికీ, ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాత్రం ‘ప్రాణం ఖరీదు’. ఈ సినిమా తరువాత వచ్చిన ‘మనవూరి పాండవులు’ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని తనవైపుకు తిప్పుకోగలిగారు. ‘పున్నమి నాగు’ సినిమాతో అందరూ ఆయన గురించి మాట్లాడు కోవడం మొదలైంది. ఆ తరువాత ఆయన ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ .. ‘శుభలేఖ’ .. ‘మంచు పల్లకి’ సినిమాలు చేసుకుంటూ వెళ్లారు.
అయితే అప్పటికి వరకూ కూడా ఆయనకి తాను ఏ రూట్లో వెళ్లాలనే విషయంలో ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు ప్రేక్షకుల హృదయాలను పెనవేసుకుపోయి ఉన్నారు. వాళ్లకు భిన్నంగా తాను కనిపించాలంటే, అంతవరకూ వారు చేయనివి చేయాలి అనే ఆలోచన చిరంజీవికి వచ్చింది. దాంతో ఆయన తనకంటూ ఒక స్టైల్ ను సెట్ చేసుకుని, డాన్స్ .. ఫైట్లపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అలా ‘యమకింకరుడు’ .. ‘అభిలాష’ సినిమాలకి ఆయన తన ఆలోచనను ఆచరణలో పెట్టడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది.
సరిగ్గా ఆ సమయంలోనే ఆయనకి ‘ఖైదీ’ సినిమా పడింది. ఈ సినిమా ఒక కొత్త చిరంజీవిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. యాక్షన్ హీరోగా ఆయనను నిలబెట్టేసింది. చిరంజీవి కెరియర్ ను ఒక్కసారిగా మలుపు తిప్పేసింది. తనదైన స్టైల్ ను చిరంజీవి ఆవిష్కరించడంతో ఆయనకంటూ అభిమానుల సంఖ్య పెరుగుతూ వెళ్లడం మొదలైంది. ఆ తరువాత ‘గూండా’ .. ‘దొంగ’ వంటి సినిమాలు పడటంతో ఇక ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. సినిమా .. సినిమాకి ఆయన తన డాన్సులకు .. ఫైట్లకు మెరుగులు పెడుతూ వెళ్లారు.
ఒక వైపున సీనియర్ స్టార్ హీరోల జోరును తట్టుకుని నిలబడుతున్న సమయంలోనే, కొత్త నీరులా బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ ముగ్గురు హీరోలు కూడా చాలా బలమైన నేపథ్యం నుంచి వచ్చారు. అందువలన చిరంజీవి మరింతగా తన మార్కు చూపించవలసి వచ్చింది. ఇలాంటి ఒక అరుదైన పరిస్థితి ఆయనకి మాత్రమే ఎదురైందనడంలో సందేహం లేదు. తనకి గల మాస్ ఇమేజ్ ను నిలబెట్టుకోవడం కోసం ఆయన ఆ తరహా కథలు ఎంచుకుంటూనే, యాక్షన్ తో పాటు ఎమోషన్ లోను .. కామెడీలోను తనకి తిరుగులేదని పించుకున్నారు.
90లలో ‘కొండవీటిదొంగ’ .. ‘గ్యాంగ్ లీడర్’ .. ‘రౌడీ అల్లుడు’ వంటి సూపర్ హిట్లతో ఆయన తన దూకుడును కొనసాగించారు. ఇక ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా ఆయన కెరియర్ మొత్తానికి కావలసిన క్రేజ్ ను సంపాదించిపెట్టింది. అలా ఆయన తన దైన స్టైల్లో విజృంభిస్తూనే ‘ఇంద్ర’ .. ‘ఠాగూర్’ .. ‘స్టాలిన్’ .. ‘సైరా’ వంటి విజయాలతో కొత్త రికార్డులను సృష్టించారు. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ .. కాస్ట్యూమ్స్ నుంచి ప్రతి విషయంలోను కొత్తదనాన్ని చూపిస్తూ ముందుకు వెళ్లడమనేది ఆయన విజయ రహస్యంగా కనిపిస్తుంది.
కెరియర్ తొలినాళ్లలో కొన్ని సినిమాల్లో చిరంజీవి నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను పోషించారు. ముగ్గురు నలుగురు హీరోల్లో ఒకరుగా కూడా కనిపించారు. అలాంటి చిరంజీవి అంచలంచెలుగా ఎదుగుతూ ఎదురులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు .. తిరుగులేని ప్రయాణాన్ని కొనసాగించారు. రాఘవేంద్రరావు .. కోదండరామిరెడ్డి .. విజయబాపినీడు .. కోడి రామకృష్ణ .. రవిరాజా పినిశెట్టి వంటి దర్శకులతో చిరంజీవి ఎక్కువ సినిమాలు చేశారు. ఇక ఆయన సరసన ఎక్కువ సినిమాలలో అలరించిన కథానాయికల జాబితాలో విజయశాంతి .. రాధ .. రాధిక .. సుహాసిని .. భానుప్రియ కనిపిస్తారు.
‘రజనీకాంత్ స్టైల్ .. కమల్ నటన రెండూ కలిసి ఒక్క చిరంజీవిలోనే ఉన్నాయి’ అని బాలచందర్ ప్రశంసించడం చిరూ ప్రతిభకు కొండంత కొలమానం. చిరంజీవి ఎంత ఎదిగినా అంతగా ఒదిగివుంటారు. ఏ విషయంలోనైనా తన అవసరం ఉందని అనుకుంటే ముందుకు రావడానికి ఆయన ఎంతమాత్రం ఆలస్యం చేయరు. యంగ్ టాలెంట్ ను ప్రశంసించడానికీ .. ప్రోత్సహిస్తూ వాళ్లతో సినిమాలు చేయడానికి ఆయన వెనుకాడరు. తన ఈ ప్రయాణంలో తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరినీ ఆయన గౌరవిస్తూనే ఉంటారు. సుదీర్ఘమైన ఆయన ప్రస్థానంలో ఆదర్శంగా తీసుకునే అంశాలు .. స్ఫూర్తిని పొందే పాఠాలు ఎన్నో కనిపిస్తాయి.
సైరా తరువాత ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేర్ వీరయ్య, భోలా శంకర్ సినిమాల్లో నటించిన చిరంజీజి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్నారు.
2006లో ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవికి ఈ ఏడాది దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ విభూషణ్’ తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఉత్తమ నటుడిగాను .. ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారిగాను ఎప్పటికీ నిలిచివుండే ఎవరెస్టు శిఖరమే!
(ఆగస్ట్ 22, చిరంజీవి జన్మదిన ప్రత్యేకం)
– పెద్దింటి గోపికృష్ణ