Sunday, January 19, 2025
Homeసినిమాస్ఫటికం లాంటి మనిషి కైకాల: చిరు  భావోద్వేగ సందేశం

స్ఫటికం లాంటి మనిషి కైకాల: చిరు  భావోద్వేగ సందేశం

కైకాల సత్యనారాయణ మృతిపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేతుకుంటూ అయన తెలుగు సినీ రంగానికి గొప్ప సంపదను అందించి వెళ్ళారని కొనియాడారు.  సోషల్ మీడియాలోభావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు….

“తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ, నవరస నటనా నట సార్వ భౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం నన్ను కలచివేస్తోంది. శ్రీ కైకాల గారు తెలుగు సినీ రంగానికే కాదు, భారతీయ కళా రంగానికి గర్వ కారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటులు. శ్రీ సత్యనారాయణ గారు పోషించినటువంటి వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో వేరొక నటుడు పోషించి ఉండరు.

శ్రీ కైకాల గారితో కలిసి నేను ఎన్నో సినిమాల్లో నటించాను. ఆ సందర్భంగా ఆయన నటనా వైదుష్యాన్ని, వ్యక్తిత్వాన్ని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం నాకు కలిగింది. గొప్ప స్పాంటేనియిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మనిషి. నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం కలవారు. నన్ను ‘తమ్ముడూ’ అంటూ తోడబుట్టినవారిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆప్యాయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆనందకరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

నటన, రుచికరమైన  భోజనం రెండూ శ్రీ కైకాల సత్యనారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ ఏడాది అయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యనారాయణ గారు సురేఖతో “అమ్మా ఉప్పు చేప వండి పంపించు’ అని అన్నప్పుడు “మీరు త్వరగా కోలుకోండి, ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం” అని అన్నాము. ఆ క్షణాన అయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోష పడిపోయారు.

శ్రీ కైకాల సత్యనారాయణ గారు గొప్ప సినీ సంపదను అందించి వెళ్ళిపోయారు. అయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ అయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాను’” అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.

Also Read : కైకాల సత్యనారాయణ ఇక లేరు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్